ఈ ఏడాది కూడా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ పశుసంవర్ధక శాఖ సంచాలకులు కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమపై మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో వినియోగదారులకు చేపల లభ్యత, మార్కెటింగ్, చిల్లర అమ్మకాలు, త్వరలో చేపట్టబోయే చేపల పిల్లల పంపిణీ ప్రతిపాదనలు, మిగిలిపోయిన గొర్రెల పంపిణీ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
బాధ్యత జిల్లా మత్స్య అధికారులదే..
రాష్ట్రంలో ఉచితంగా చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్య సంపద ఎంతో పెరగడమే కాకుండా మత్స్యకారుల ఆర్ధికాభివృద్ధికి ఇతోధికంగా దోహదపడుతుందని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ ఆంక్షల ప్రభావంతో రిటైల్ విక్రయాలు కొంత మేర తగ్గినప్పటికీ సర్కారు తీసుకున్న చర్యల కారణంగా చేపల ధరలు నియంత్రణలో ఉన్నాయని ప్రకటించారు. ప్రతి మత్స్యకారుడు మత్స్య సహకార సంఘంలో సభ్యుడిగా నమోదయ్యేలా చూసే బాధ్యత జిల్లా మత్స్య అధికారులదేనని తేల్చిచెప్పారు.
రాష్ట్రంలో అన్ని అంగన్వాడి కేంద్రాలకు విజయ డెయిరీ ద్వారా పాలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మిగిలిన లబ్ధిదారులకు కూడా త్వరలోనే గొర్రెలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని... ఇప్పటికే కొందరు లబ్ధిదారులు డీడీలు చెల్లించారని మంత్రి పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 'మీ అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం'