అనాథ పిల్లలను తమ బిడ్డలుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కలిపించి అక్కున చేర్చుకుంటోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. హైదరాబాద్, సైదాబాద్‌లో 4 కోట్ల ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ బాలుర సదనాలను మంత్రి సత్యవతి రాఠోడ్‌తో పాటు హోంమంత్రి మహమూద్ అలీ, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, జువైనల్ హోమ్స్ డైరెక్టర్ శైలజ, కలెక్టర్ శర్మన్ పాల్గొన్నారు.
వాళ్ల బాధ్యత ప్రభుత్వానిదే..
"రాష్ట్రంలో ఏ ఒక్క చిన్నారి అనాథనని బాధపడకూడదని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఒక అనాథ చదువుకుని, స్థిరపడి... పెళ్లి చేసుకుని కుటుంబం ఏర్పర్చుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వమే అండగా ఉండాలని సూచించారు. రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా.. ఇప్పటి వరకు 4000 మంది చిన్నారులను గుర్తించారు. అందులో చాలా మంది పిల్లల తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ల ఇళ్లకు పంపించాం. ఇంకా సుమారు 1000 మంది పిల్లలను హైదరాబాద్‌లోని పలు హోమ్స్‌కు పంపించాం. ఇక నుంచి ఏ ఒక్క చిన్నారి అనాథ అని.. తనకు తల్లిదండ్రులు లేరని.. అందరిలా తనకు సౌకర్యాలు లేవని బాధపడకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదే"- సత్యవతి రాఠోడ్, రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి