రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న.. ఉచిత చేప పిల్లల పంపిణీ(Free fish distribution) కార్యక్రమం ఈ సంవత్సరం కూడా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్, మాసాబ్ ట్యాంక్‌లోని పశు భవన్‌లో.. మత్స్య శాఖ కార్యకలాపాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా.. చేప పిల్లల పంపిణీ, చెరువుల టెండర్లు, చెరువులకు జియో ట్యాగింగ్, సంచార చేపల మార్కెట్లు, విజయ పాల ఉత్పత్తుల మార్కెటింగ్ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
పెద్ద ఎత్తున నిధులు..
నీలి విప్లవం(blue revolution) తీసుకురావాలన్న సీఎం ఆలోచనల మేరకు ప్రభుత్వం.. మత్స్య రంగ అభివృద్ధి(Fisheries Development) కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని మంత్రి వివరించారు. ఈ ఏడాది చేపల పెంపకం చేపట్టేందుకు.. 34,024 చెరువులను గుర్తించి, రూ. 89 కోట్ల వ్యయంతో 93 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. అలాగే రూ. 25 కోట్ల వ్యయంతో 10 కోట్ల రొయ్య పిల్లల విడుదలకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
పకడ్బందీగా వ్యవహరించాలి..
చేప పిల్లల కొనుగోలు విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని మంత్రి అధికారులకు సూచించారు. విత్తనాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా మార్గదర్శకాలు రూపొందించాలని మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాను ఆదేశించారు. మరో 10 రోజుల్లో టెండర్లు ఆహ్వానించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ బ్రాండ్ పేరిట..
ప్రజల వద్దకే నాణ్యమైన చేపలు, చేపల వంటకాలను తీసుకెళ్లాలనే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీలో 150 సంచార చేపల మార్కెట్లను(Nomadic fish markets) అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. 60 శాతం రాయితీపై అర్హులైన లబ్ధిదారులకు చేపలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. విజయ పాలు, పాల ఉత్పత్తుల ఔట్లెట్ల తరహాలో.. త్వరలో తెలంగాణ బ్రాండ్ పేరిట.. సముద్ర చేపలు, చేపల వంటకాల విక్రయాలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: police treatment: వింటారా..? ఐసోలేషన్‌లో ఉంటారా..?