అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ పథకాల ఫలాలు పూర్తిగా అందేలా కృషిచేయాలని గిరిజన సంక్షేమశాఖా మంత్రి సత్యవతి రాఠోడ్ అధికారులను ఆదేశించారు. వారి అభ్యున్నతి కోసం ఇంకా ఏం చేస్తే బాగుంటుందన్న విషయమై అందరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని జిల్లాల గిరిజన సంక్షేమ అధికారులు, ఐటీడీఏల పీఓలతో హైదరాబాద్ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి సమావేశమయ్యారు.
పథకాలను మరింత సమర్థంగా అమలు చేయడం, గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించడం సహా పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి లభించేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కొవిడ్ దృష్ట్యా... గిరిజన గురుకులాలు, ఇతర పాఠశాలల్లోని విద్యార్థులకు డిజిటల్ విద్య అందుబాటు విషయాన్ని ప్రస్తావించారు. విద్యార్థుల వద్దకే ఉపాధ్యాయులు వెళ్లి బోధించేలా ఇచ్చిన ఆదేశాల అమలుపై అధికారులతో మంత్రి సమీక్షించారు.