Minister Nani Comments: కేంద్ర మంత్రి మురళీధరన్‌పై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ, మనుషులు, ఉద్యోగులపై దాడులు చేసిన ముద్దాయిని కేంద్ర మంత్రి మురళీధరన్ జైలుకు వెళ్లి పరామర్శించడం దారుణమని అన్నారు. ముద్దాయిని పరామర్శించి రాజకీయాలను దిగజార్చారని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రాన్ని భాజపా నేతలు ఏం చేయాలనుకున్నారని ప్రశ్నించారు. భాజపా నేతలు దిగజారి రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్రాన్ని రావణకాష్టం చేసేందుకు యత్నించడం బాధ్యతారాహిత్యమన్నారు.
"రాష్ట్రాన్ని భాజపా నేతలు ఏం చేయాలనుకున్నారు? భాజపా నేతలు దిగజారి రాజకీయాలు చేస్తున్నారు.రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేసే ప్రయత్నం బాధ్యతారాహిత్యం. రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే కేంద్రం, ఎన్ఐఏ, ఐబీ ఏం చేస్తున్నాయి? విదేశీ వ్యవహారాల మంత్రి దిగజారి హేయంగా ప్రవర్తించారు. ముద్దాయి పరామర్శను కేంద్రమంత్రి విజ్ఞతకే వదిలేస్తున్నాం. భాజపా బారి నుంచి రాష్ట్రాన్ని భగవంతుడే కాపాడాలి: పేర్ని నాని రాజకీయాల కోసం భాజపా దిగజారుడుతనాన్ని ఖండిస్తున్నా"
- పేర్ని నాని, రాష్ట్ర మంత్రి
సంక్రాంతికి పోలీసులు వద్దన్నా ప్రజలు బేఖాతరు చేసి కోడిపందేలు జరుపుకున్నారని, గుడివాడలో ఏదో జరిగిందంటున్న వారు నిజనిర్ధారణ చేసేందుకు పోలీసులను ఆశ్రయించవచ్చు కదా అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. కొడాలి నానిని చంద్రబాబు మానసికంగా వేదిస్తున్నారని అన్నారు. ఉద్యోగ సంఘాలను చర్చలకు రావాలని కమిటీ తరపున మనస్ఫూర్తిగా మరోసారి ఆహ్వానిస్తున్నామన్నారు. డిమాండ్ ఏదైనా సరే.. ఉద్యోగులు చర్చించేందుకు ముందుకు రావాలని కోరారు.
వైకాపా ప్రభుత్వంపై కేంద్రమంత్రి తీవ్ర వ్యాఖ్యలు..
Union Minister V Muraleedharan fiers on cm jagan: జగన్మోహన్‌రెడ్డి అవినీతి పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిగిపోయారని.. కేంద్రమంత్రి మురళీధరన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సన్నగిల్లాయని, ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయనే అనుమానం కలుగుతోందన్నారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీగా ఉన్న కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన భాజపా నేత శ్రీకాంత్‌రెడ్డిని... రాష్ట్ర పార్టీ నేతలతో కలిసి మురళీధరన్ పరామర్శించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని వదిలేసి, అలాంటి వాటిని అడ్డుకోబోయిన శ్రీకాంత్‌రెడ్డిని అరెస్టు చేయడం దారుణమన్నారు.
"భాజపా నాయకుడు శ్రీకాంత్‌రెడ్డిపై కేసులు ఎత్తివేయాలి. శ్రీకాంత్‌ను చంపేందుకు ఆత్మకూరులో కుట్రపన్నారు. భాజపా నేతలను ఆత్మకూరుకు పంపాలి. అల్లర్లు జరిగిన రోజు నుంచి భాజపా నేతలను అక్కడికి పంపలేదు. జగన్ అసమర్థత వల్ల రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. పాలనపై సీఎం దృష్టి పెట్టకపోవడంతో వైకాపా నాయకులు రెచ్చిపోతున్నారు. అల్లర్లకు కొందరు ప్రోత్సహిస్తున్నారు.. సీఎం బాధ్యత వహించాలి"
- మురళీధరన్, కేంద్రమంత్రి
ఇదీ చదవండి : AP Employees Strike: 'ఇదేదో ఆషామాషీ ఉద్యమం కాదు'
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!