రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లేఖలు రాశారు. ప్రతి ఆదివారం పది గంటలకి పది నిమిషాలు అనే కార్యక్రమంలో భాగస్వాములవుతూ, ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని కోరారు. రానున్న వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు రాకుండా చూద్దామని లేఖలో ప్రస్తావించారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సొడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ప్రతి వారంకోసారి ఉపయోగించనున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మురికి కాల్వల పూడిక తీత, లోతట్టు ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీటిని ఎత్తిపొయడం, ప్రతి రోజు చెత్త తరలింపు కార్యక్రమాలను కూడా ప్రత్యేకంగా చేపట్టాలన్నారు. ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమం రానున్న పదివారాలు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తమ ఇళ్లు, పరిసరాల్లో దోమలు నిలిచి ఉండేందుకు ఆస్కారమున్న వాటిని శుభ్రపరుచుకోవడం, యాంటీ లార్వా కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా తన లేఖలో కోరారు.
సామాజిక బాధ్యతగా
ఈ కార్యక్రమంతో ప్రతి ఒక్క పట్టణ పౌరుడు పాల్గొనే విధంగా చూడాలని, అందుకు సహకారం అందించాలని ప్రజాప్రతినిధులను కేటీఆర్ కోరారు. ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని తమ తమ ఇళ్ల నుంచే ప్రారంభించాలని.. తర్వాత తమ పరిధిలోని పట్టణాల్లో విస్తృతంగా తిరుగుతూ ప్రజా ఆరోగ్యం పైన చైతన్యం తీసుకువచ్చే విధంగా ప్రజలను సమాయత్తం చేస్తూ, పరిసరాల పరిశుభ్రత ఓ సామాజిక కార్యక్రమంగా ప్రజలు భావించే విధంగా ప్రచారం కల్పించాలన్నారు. మనందరం కలిస్తే రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రభావాన్ని సాధ్యమైనంత మేర తగ్గించగలమన్న నమ్మకం తనకున్నదని లేఖలో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రేపు సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం