ఉద్యోగాల కల్పనపై భాజపా దుష్ప్రచారాన్ని తెరాస శ్రేణులు బలంగా తిప్పికొట్టాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్షా 33 వేల ఉద్యోగాలు కల్పించామని.. మరో 50 వేలు త్వరలో భర్తీ చేయనున్నామని వివరించారు. పట్టభద్రుల ఎన్నికలపై తెరాస ముఖ్య శ్రేణులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తెరాసకు, ప్రభుత్వ ఉద్యోగులతో పేగు సంబంధముందని.. వారికి ఎన్నో చేశామని కేటీఆర్ పేర్కొన్నారు.
తెరాస అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారంలోకి దూసుకెళ్తున్నారని... వాణీ అభ్యర్థిత్వంపై ప్రత్యర్థుల నుంచి కూడా సానుకూల స్పందన వస్తోందన్నారు. తెరాస హయాంలో నల్గొండ జిల్లాకు మూడు వైద్య కళాశాలలు వచ్చాయని.. వరంగల్‌కు ఐటీ, ఇతర పెట్టుబడులు వస్తున్నాయని.. ఖమ్మంలో ఐటీ టవర్ ప్రారంభించుకున్నామని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్‌లో ఏడేళ్లలో అద్భుతమైన ప్రగతి సాధించిందని.. నగరానికి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిని నగర విద్యావంతుల దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతి ఒక్క ఓటరుని నేరుగా కలిసి తెరాస సర్కారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలన్నారు.