KTR Response on Gang Rape: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. బాలికపై జరిగిన దారుణంపై వార్త చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని.. ఇది అత్యంత దుర్మార్గమన్నారు. ఈ ఘటనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌లను కోరారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నవారు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని సూచించారు. నిందితులకు ఏ హోదా ఉన్నా... ఎవరితో సంబంధాలున్నా ఉపేక్షించవద్దని కేటీఆర్ స్పష్టం చేశారు.
కేటీఆర్ ట్వీట్‌పై స్పందించిన హోంమంత్రి మహమూద్ అలీ.. నిందితులందరినీ వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. బాలికపై అఘాయిత్యం దారుణమైన ఘటనగా అభివర్ణించిన మంత్రి.. నేపథ్యంతో సంబంధం లేకుండా నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేసి.. చట్టప్రకారం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ, హైదరాబాద్ సీపీకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు వివరించారు.
జూబ్లీహిల్స్‌లో గత నెల 28న బాలిక తన స్నేహితులతో కలిసి పబ్‌కు వెళ్లగా.. ఇంటికి తీసుకెళ్తామని నమ్మించిన కొందరు వ్యక్తులు కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. నిందితుల్లో.. ఎంఐఎం నేతల కుమారులన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా.. ఇప్పటికే పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా.. అందులో ఒకరు వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్ కుమారుడు, మరోకరు ఎంఐఎం ఎమ్మెల్యే కుమారునిగా తెలుస్తోంది. విపక్షాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ భాజపా, బీజేవైఎం శ్రేణులు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి: