హైదరాబాద్‌లో సుడిగాలి పర్యటన చేసిన పురపాలక మంత్రి కేటీఆర్... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారంచుట్టారు. తొలుత బాగ్‌లింగంపల్లిలోని లంబాడి తండాలో 10 కోట్లతో నిర్మించిన 126 రెండుపడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. అడిక్‌మెట్‌లో మూడున్నరకోట్లతో నిర్మించిన మల్టీపర్పస్ స్పోర్ట్స్‌కాంప్లెక్స్ ప్రారంభించారు. దోమలగూడలో సుమారు 10 కోట్లతో నిర్మించనున్న జోనల్, డిప్యూటి కమిషనర్ కార్యాలయాలు, నారాయణగూడ క్రాస్ రోడ్స్‌లో.... 4 కోట్లతో నిర్మించనున్న మోడల్ మార్కెట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించే జంట రిజర్వాయర్లను వాసవీనగర్‌లో... కేటీఆర్ ప్రారంభించారు. 9.42 కోట్లతో జంట రిజర్వాయర్లను జలమండలి పూర్తిచేసింది. 2.5 మిలియన్ లీటర్ల నీటి సామర్థ్యంతో నిర్మించిన ఆ రిజర్వాయర్లు తాగునీటి అవసరాలకు అందుబాటులోకి వచ్చాయి.
నగరాభివృద్ధికి కేంద్ర సాయం...
దేశంలో ఎక్కడా రెండుపడక గదుల ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇవ్వడం లేదన్న కేటీఆర్... పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. లబ్దిదారులు ఇళ్లను కిరాయికిచ్చినా.. అమ్మినా పట్టా రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని మంత్రి స్పష్టంచేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..... హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
భాజపా శ్రేణుల నిరసనలు...
హైదరాబాద్‌లో పలుచోట్ల అభివృద్ధిపనులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి కేటీఆర్ శ్రీకారం చుట్టగా... భాజపా శ్రేణులు నిరసనకు దిగారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల పేర్లు శిలాఫలకాలపై పెట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దోమలగూడ, నారాయణగూడ, బాగ్‌లింగంపల్లిలో నిరసనకు దిగారు. తెరాస శ్రేణులు ప్రతిఘటించగా వాగ్వాదం చోటుచేసుకుంది. కేటీఆర్ పర్యటనలో చాలా ప్రాంతాల్లో భాజపా శ్రేణుల ఆందోళనతో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలిగానీ ఆ తర్వాత అభివృద్ధి కోసం సమష్ఠిగా పాటుపడాలని కేటీఆర్ భాజపానేతలకు సూచించారు. ఎన్నికల తర్వాత ఈ తరహా సంప్రదాయం మంచిది కాదని మంత్రి కేటీఆర్ హితవు పలికారు.
కాంగ్రెస్ ఆందోళనలు...
ఎల్బీనగర్ పరిధిలో జంట రిజర్వాయర్ల ప్రారంభోత్సవం ఉద్రిక్తతకు దారితీసింది. నిర్ణీత సమయం కంటే ముందే కార్యక్రమం నిర్వహించారని కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రారంభోత్సవ కార్యక్రమ ఫ్లెక్సీలు, తెరాస జెండాలను కాంగ్రెస్ కార్యకర్తలు చింపేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను నిలువరించారు. రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకొని అక్కణ్నుంచి తరలించారు.