American industrial park: రాష్ట్రంలో అమెరికన్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక పారిశ్రామిక పార్కు ఏర్పాటు కానుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు వందెకరాల్లో 50కి పైగా పరిశ్రమలు ఏర్పాటయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. తాము స్థాపించబోయే పరిశ్రమలన్నింటికీ ఒకేచోట స్థలాన్ని కేటాయించాలంటూ అమెరికా పర్యటనలో ఆయా కంపెనీల అధిపతులు, సీఈవోలో మంత్రి కేటీఆర్‌ను కోరారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి... అమెరికన్ పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌కు అక్కడే ఆదేశాలు జారీచేయగా... ఆయన రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అధికారులతో మాట్లాడారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్కు ఏర్పాటుకు అనువైన స్థలాలున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని అమెరికా కంపెనీల ప్రతినిధులకు వెల్లడించిన మంత్రి... సంస్థల నుంచి ప్రతిపాదనలు వస్తే వెంటనే పార్కు స్థలాన్ని సిద్ధంచేస్తామని చెప్పారు. వారం నుంచి 15 రోజుల్లో ప్రతిపాదనలు పంపిస్తామని ఆయా సంస్థలు తెలిపాయి.
ఇప్పటివరకు 15 కంపెనీలు రాష్ట్రంలో తమ కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సంసిద్ధత తెలుపుతూ ప్రభుత్వానికి లేఖలు పంపగా... రాష్ట్ర సర్కార్ కార్యాచరణకు సిద్ధమవుతోంది. పరిశ్రమలు, టీఎస్ఐఐసీ అధికారులు అమెరికన్ పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు స్థల పరిశీలన చేయనున్నారు. ఎంపిక అనంతరం అమెరికన్ సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానిస్తారు. జీవశాస్త్ర, ఔషధ పరిశ్రమలు మినహా... ఎలక్ట్రానిక్స్ తదితర వాటికి ఇక్కడే భూములు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఔషధ పరిశ్రమలకు మాత్రం ఔషధనగరిలో స్థలాలను కేటాయించనుంది.
ఇదీచూడండి: ఫలవంతంగా కేటీఆర్ అమెరికా పర్యటన.. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు..