వ్యర్థాల నుంచి సంపద సృష్టించటంలో హైదరాబాద్ ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. జీడిమెట్లలో ఏర్పాటు చేసిన... భవన నిర్మాణ శిథిలాల రీసైకిల్ ప్లాంటును మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. 500 టీపీడీ సామర్థ్యంతో... రూ. 10 కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎల్బీనగర్ పరిధిలో సంక్రాంతికి మరో ప్లాంటును ప్రారంభిస్తున్నామన్న కేటీఆర్... నగరంలో మరో రెండు ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. దక్షిణభారతదేశంలోనే జీడిమెట్ల రీసైకిల్ ప్లాంటు అతిపెద్దదిగా పేర్కొన్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో వీటిని రూపొందిస్తున్నట్టు వివరించారు. చెత్త తరలింపునకు టోల్ ఫ్రీ నెంబర్ 1800120072659కు సమాచారం అందించాలని కేటీఆర్ సూచించారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ప్లాంట్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. 17ఎకరాల్లో భవన వ్యర్థాల రీ-సైక్లింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. జవహార్నగర్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను వారం రోజుల్లో ప్రారంభిస్తామని వెల్లడించారు. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకువస్తున్నారని వ్యాఖ్యానించారు. భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ చేస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. రీ సైక్లింగ్ చేశాక 95శాతం మళ్లీ వాడుకోవచ్చున్నారు.
ఇదీ చూడండి: నిత్య పెళ్లికొడుకులా ట్రాఫిక్ కానిస్టేబుల్