రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం తీసుకోవాల్సిన సంస్కరణలపై అధికారులకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు. కొన్ని సంస్కరణలను ఒక నెలలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా వేగంగా పని చేయాలని ఆదేశించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం చేపడుతున్న సంస్కరణలతో ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఒకే చోట అన్ని సేవలు
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం చేపడుతున్న సంస్కరణల ద్వారా ఆయా డిపార్ట్మెంట్ సేవల్లో గణనీయమైన మార్పులు వస్తాయన్నారు. దీంతో పాటు ప్రజలకు ఏ సేవ అయినా ఒకే చోట అందించే విధంగా సిటీజన్ సర్వీస్ మేనేజ్మెంట్ పోర్టల్ అవసరాన్ని ఈ సమావేశంలో చర్చించారు. తద్వారా ఏ సేవ అయినా నేరుగా ఆన్ లైన్ ద్వారా అందుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఆయా శాఖలు చేపడుతున్న సంస్కరణలు, కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక డాష్ బోర్డ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
సమన్వయం అవసరం
టీఎస్ బీపాస్ అమలుపై వివిధ శాఖల అధికారులతో మంత్రి కేటీఆర్ చర్చించారు. టీఎస్ బీపాస్ దేశంలో ఎక్కడా లేని విధంగా పౌరులకి అత్యంత సౌకర్యవంతంగా, సులభంగా, పారదర్శకంగా భవన నిర్మాణ, లేఅవుట్లకు అనుమతులు ఇస్తోందని అన్నారు. చట్టం అమలుకు వివిధ శాఖల్లో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. టీఎస్ బీపాస్ అనేది చారిత్రాత్మక చట్టమని... దీని అమలులో వివిధ శాఖల సహకారం, సమన్వయం అవసరమని ఆ దిశగా కలిసి పనిచేయాలని సూచించారు.
త్వరలో కార్యాచరణ
టీఎస్ బీపాస్ అనుమతులకు సంబంధించి అవసరం ఉన్న ప్రతి శాఖ నుంచి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్‌ను ప్రత్యేకంగా నియమించాలని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే శాఖలన్నీ సమన్వయంతో సహకారంతో క్షేత్రస్థాయిలో టీఎస్ బీపాస్ అమలు చేసేందుకు కార్యాచరణ ప్రకటిస్తామని కేటీఆర్ తెలిపారు.
ఇదీ చదవండి : ఇంటర్ ఆర్ట్స్ గ్రూపుల సిలబస్ తగ్గింపుపై గందరగోళం