కొత్త రెవెన్యూ విధానం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లోని దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరిస్తామని, సొంత ఆస్తులపై ప్రజలకు న్యాయసమ్మతంగా టైటిల్ హక్కులు కల్పిస్తామని పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. భవిష్యత్తులో ఆస్తుల క్రయవిక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందని చెప్పారు.
ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు. ప్రజలు తమ నివాసిత ఇళ్ల హక్కులపై ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం ఆయన ప్రగతిభవన్‌లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా సమావేశాలు నిర్వహించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, సంచాలకుడు సత్యనారాయణ, టౌన్‌ప్లానింగు, తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీ రామారావు మాట్లాడారు.
‘‘దశాబ్దాలుగా వివిధ కారణాలతో ప్రజలకు వారి ఆస్తులపై హక్కులు దక్కలేదు. గ్రామాలకన్నా పట్టణాల్లో ప్రజా ఆస్తుల టైటిల్ సంబంధ అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలు ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా, పేద, మధ్యతరగతుల వారికి ఆస్తి హక్కు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసముంటున్న వారిని జీవో నంబరు 58, 59 ద్వారా క్రమబద్ధీకరించి.. ఉపశమనం కలిగించాం. అసైన్డ్, యూఎల్‌సీ భూముల్లో వెలసిన బస్తీలు, కాలనీల్లో కొన్నేళ్లుగా నివాసముంటున్న వారికి సైతం యాజమాన్య హక్కులు లేవు. వీటిని కల్పించేందుకు వీలుగా ప్రణాళికలను రూపొందిస్తున్నాం.- మంత్రి కేటీఆర్ .
ధరణిలో ప్రతి ఇంచు నమోదు
రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దీనిద్వారా ప్రతి ఇంచు భూమిని రికార్డులలో నమోదు చేస్తాం. ఆస్తుల భద్రత కల్పించేందుకు చేపట్టిన ప్రయత్నాలకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. ఈ కార్యక్రమాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ, పేదలు పెద్దఎత్తున పాల్గొనేలా సమాయత్తం చేయాలి. ఏ కాలనీలో ఎలాంటి భూ సంబంధిత సమస్య వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు? వారెందరు? ఇందుకు పరిష్కారం ఏమిటి? వంటి వివరాలను మంగళవారం సాయంత్రంలోగా పురపాలక శాఖకు అందించాలి. వీటికి ప్రభుత్వం పరిష్కారం చూపుతుంది. ఈ విషయంలో మంత్రులు ఎమ్మెల్యేలకు సంపూర్ణ సహకారమివ్వాలి’’ అని అన్నారు. ఈ సమావేశానికి హాజరైన అన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పరిధిలోని నగరాల్లో, పట్టణాల్లోని భూసంబంధిత సమస్యలను మంత్రికి తెలిపారు. మిగిలిన సమస్యల వివరాలను మంగళవారం అందజేస్తామన్నారు.
ఇవీ చూడండి: ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు: కేటీఆర్