దక్షిణాది నగరాలు అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్నా.... అందుకు తగ్గట్లుగా కేంద్రం నుంచి ప్రోత్సాహం లభించటం లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ లక్డీకపూల్‌లో వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్... రానున్న రాష్ట్ర బడ్జెట్‌లో పారిశ్రామిక రంగానికి తగిన కేటాయింపులు చేయనున్నట్లు చెప్పారు. కరోనా సంక్షోభంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైనందున... మళ్లీ కోలుకునేలా కేంద్ర బడ్జెట్ రూపొందించాలని కోరారు. ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్‌ను అందజేస్తున్న హైదరాబాద్‌లో వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు చేయకుండా... హిమాచల్‌ప్రదేశ్‌కు తరలించారన్నారు. నినాదాలు, ప్రసంగాలతో దేశం అభివృద్ధి సాధ్యం కాదని కేటీఆర్ హితవు పలికారు.
పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం గత బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కరోనా సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ పడిపోయిన కారణంగా... అమలులో సాధ్యం కాలేదు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ బడ్జెట్‌లో పారిశ్రామిక రంగానికి కేటాయింపులు ఉండేలా కృషి చేస్తాం. భవిష్యత్‌లో ఔషధ రంగంలో హైదరాబాద్ అభివృద్ధి సాధిస్తే... అది తెలంగాణకు మాత్రమే కాదు... దేశానికే ఖ్యాతిని తీసుకువస్తుంది. కరోనా వ్యాక్సిన్‌కు హైదరాబాద్ నేడు ప్రధాన కేంద్రంగా మారింది. కానీ దురదృష్టవశాత్తు ఎన్ని సార్లు అడిగినా ఇక్కడ వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు చేయలేదు. యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేస్తే... ఎన్డీయే వచ్చాక దాని గురించి సమాధానం చెప్పేవారు కూడా లేరు. దేశంలోనే అగ్రగామిగా నిలిచే బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలాంటి నగరాలు దక్షిణాదిలో ఉన్నా... కేటాయింపుల విషయంలో ప్రాధాన్యత లభించటంలేదు. 'సబ్‌కా సాత్-సబ్‌కా వికాస్' అంటూ... ప్రధాని చెప్పే నినాదం మాటల్లో కాకుండా , అమలులో చేసి చూపించాలని కోరుతున్నా.- కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి.
ఇవీ చూడండి: 'కేటీఆర్ సీఎం'... ప్రచారంపై కిషన్‌రెడ్డి ఏమన్నారంటే?