Harishrao Fires on Central Government: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తరుపున చేనేత కార్మికులకు ఏం చేసిందో... కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వడం పట్ల ఉమ్మడి మెదక్ జిల్లా తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నారాయణగూడలోని టెస్కో కార్యాలయంలో తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. చింత ప్రభాకర్ చేత ప్రమాణం చేయించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ నేతన్నలకు రోల్ మోడల్.. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా సాయం చేస్తోందని హరీశ్ తెలిపారు. 350కోట్ల రూపాయల నిధులతో బతుకమ్మ చీరల ఆర్డర్‌ను వారికిచ్చి... ప్రతి సంవత్సరం ఉపాధి కల్పిస్తున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. అలాగే నేతన్నలకు బీమా, మరమగ్గాలకు సబ్సిడీ లాంటి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. నేతన్న బీమా కింద రూ.ఐదు లక్షలు సాయం అందిస్తున్నామన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే చేనేత కార్మికులకు రోల్ మోడల్ అని... అప్పటి పాలకులు కొండా లక్ష్మణ్‌ని అవమానిస్తే రాష్ట్రం ఏర్పడ్డాక సముచిత స్థానం కల్పించామన్నారు. 1250ఎకరాల్లో మెగా టెక్స్ట్ టైల్ పార్క్ వరంగల్‌లో ఏర్పాటు చేశామని... ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్న నేతన్నలకు ఇక్కడే ఉండేలా భరోసా ఇచ్చామన్నారు.
రద్దులన్ని కేంద్రానికి వర్తిస్తే పద్దులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానివి.. ఆల్ ఇండియా హ్యాండీ క్రాఫ్ట్ బోర్డు, పవర్ లుమ్ బోర్డులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. 2014లో తీసుకొచ్చిన త్రీఫ్ట్స్ ఫండ్ పథకాన్ని రద్దు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా చేనేత కార్మికులను రోడ్డున పడేసిందని మండిపడ్డారు. చేనేత కార్మికుల మీద పరోక్షంగా భారం వేసిందని... దీనివల్ల నూలు దొరకకుండా ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. రోజూ తెలంగాణకు వస్తున్న కేంద్ర మంత్రులు ఒక్క రూపాయి సహాయం చేయకుండా వెళతారని ఎద్దేవా చేశారు. మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు కేంద్రం ఒక్క రూపాయి సాయం అందించలేదని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. రద్దులన్ని కేంద్రానికి వర్తిస్తే పద్దులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానివి అని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ తనకొక గొప్ప అవకాశం కల్పించారని రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చింత ప్రభాకర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి సంస్థకు మంచి పేరు తీసుకువస్తానన్నారు. కేసీఆర్‌కు చదువుకొనే రోజుల నుంచే చేనేత కార్మికుల సమస్యలు తెలుసని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: