Gangula kamalakar on paddy procurement: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయని... ఎక్కడా ఎలాంటి సమస్యలకు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కేంద్రం సహాకారం అందించకపోయినా.. ప్రతిపక్షాలు కొనుగోళ్లు అడ్డుకోవాలని రాద్దాంతం చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వంపై 3 వేల కోట్ల రూపాయలు పైగా భారం పడుతున్నా.. సీఎం కేసీఆర్ ధాన్యం సేకరణ చేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 5,888 వేల కోట్ల రూపాయల విలువ గల 30.09 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 4 లక్షల 72 వేల మంది రైతుల నుంచి సేకరించామని పేర్కొన్నారు. ఈ ధాన్యాన్ని మిల్లులకు కూడా చేరవేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై మంత్రి ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం సేకరణ చేస్తుంటే ఓర్వలేని విపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. మొన్నటి అకాల వర్షాలకు తడిసిన 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సైతం కొనుగోలు చేసినట్టు తెలిపారు.
"6,544 కొనుగోలు కేంద్రాలకు గానూ.. దాదాపు 500 కొనుగోలు కేంద్రాల్లో విజయవంతంగా ధాన్యం సేకరణ పూర్తైంది. రోజుకు దాదాపు లక్షన్నర నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ చేస్తున్నాం. 11.64 కోట్ల గన్నీ సంచులు సేకరించాం. వీటిలో 7.52 కోట్ల బ్యాగులు వాడాం. ఇంకా 4.12 కోట్ల గన్నీలు అందుబాటులో ఉన్న దృష్ట్యా.. వీటి ద్వారా మరో 16 లక్షల మెట్రిక్ టన్నుల వరకూ సేకరించవచ్చు. తెలంగాణ రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా మొత్తం అధికారులు అప్రమత్తంగా ఉండి సేకరణ కొనసాగిస్తున్నాం. వ్యవసాయ మార్కెట్ల యార్డులకు వచ్చిన ధాన్యం పూర్తిగా సేకరిస్తాం. ఈ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా జూన్ 10వ తారీఖు వరకు పూర్తవుతుంది." - గంగులకమలాకర్, మంత్రి
బీసీల అభివృద్ధే ధ్యేయం: రాష్ట్రంలోని బీసీల సమున్నత అభివృద్ధే ధ్యేయంగా బీసీ సంక్షేమ శాఖ నిరంతరం కృషి చేస్తుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అందులో భాగంగా బీసీ యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం అత్యుత్తమ శిక్షణ అందించేందుకు ఐసీఐసీఐ అకాడమీతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలు బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల ద్వారా అమలు చేస్తారని వెల్లడించారు. ఈమేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం సమక్షంలో ఐసీఐసీఐ అకాడమీ ఫర్ స్కిల్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నారు.
ప్రపంచంలో డిమాండ్ ఉన్న ప్రొపెషనల్ కోర్సుల్ని బీసీ యువతకు ఉచితంగా అందజేస్తున్నామని మంత్రి గంగుల కమాలకర్ తెలిపారు. ఉచితంగా సాప్ట్వేర్, సాప్, అకౌంటెన్సీ తదితర స్కిల్ ఓరియంటెడ్ ప్రొగ్రాంలు అందిస్తామన్నారు. ఒక్కో బ్యాచ్‌కు మూడు నెలల పాటు అందించే ఉచిత శిక్షణకు 8వ తరగతి నుండి డిగ్రీ పూర్తి చేసిన వారు ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులైన వారికి విద్యార్హతలు, అభ్యర్థి ఇష్టానుసారం ఆయా కోర్సుల్లో శిక్షణ అందిస్తామన్నారు. జిల్లా బీసీ సంక్షేమ అధికారి కార్యాలయంతో పాటు, కార్పొరేషన్ల కార్యాలయాన్ని సంప్రదించి ఉచిత శిక్షణ కోసం నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. మొదటి విడతలో అర్హులైన అభ్యర్థులకు హైదరాబాద్ కేంద్రంగా అత్యుత్తమ శిక్షణను ఉచితంగా అందిస్తామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: