అభివృద్ధి పేరుతో.. రాజకీయంగా పబ్బం గడుపుకునే ఆలోచనకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్వస్తి పలకాలని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హితవు పలికారు. గతంలో వరంగల్‌కు ఎప్పుడూ రాని కిషన్‌రెడ్డి...ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలున్నాయనే పర్యటనకు వచ్చారని విమర్శించారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోనూ... వరదలు వచ్చినప్పుడు ఆయన ఎందుకు రాలేదని హన్మకొండలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రశ్నించారు. వరద బాధితులకు రూ.పదివేలు ఇవ్వాలంటున్న కిషన్ రెడ్డి... అసలు కేంద్రం ఏమిచ్చిందో తెలియచేయాలని అన్నారు.
కేఎంసీ ఆసుపత్రి నిర్మాణం.. కేంద్రం వల్లే ఆలస్యమైందని చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామంటూ... డబ్బాలు కడిగే వర్క్‌షాప్ ఇచ్చారని ఎర్రబెల్లి ఆక్షేపించారు. జాతీయ రహదారులపైన కనీసం గుంతలు కూడా పూడ్చలేదని అన్నారు. వరంగల్ జిల్లాలో కేంద్రం ఇచ్చిన గిరిజన యూనివర్శిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీలు ఏమయ్యాయని అన్నారు. టెక్స్ టైల్ ఫ్యాక్టరీకి గాని కాళేశ్వరం ప్రాజెక్టుగాని ఒక్క రూపాయి ఇచ్చారా అని నిలదీశారు. వరంగల్ అభివృద్ధిపై తమకు గల చిత్తశుద్ధిని ఎవరూ శంకించక్కరలేదని అన్నారు. దమ్ముంటే...నగరానికి ఎవరేం చేశారో...తేల్చుకుందామని సవాల్ చేశారు. వరంగల్ ప్రజలు విజ్ఞులని...జిత్తులమారి మాటలు నమ్మరని అన్నారు.
ఇవీ చూడండి: విద్యాసంస్థల పునఃప్రారంభంపై త్వరలోనే నిర్ణయం : మంత్రి హరీశ్