చెరువుల లీజులకు సంబంధించి కొత్త గ్రామపంచాయతీల్లో వస్తున్న సమస్యలను నిబంధనలకు లోబడి పరిష్కరించుకోవాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, తలసాని శ్రీనివాసయాదవ్.. కలెక్టర్లకు సూచించారు. పంచాయతీరాజ్, పశుసంవర్ధక శాఖల అధికారులతో సమావేశమైన ఇరువురు మంత్రులు... కొత్త పంచాయతీరాజ్ చట్టం, చెరువుల్లో చేపపిల్లల విడుదల, చేపల చెరువులు మత్స్య సహకార సంఘాలకు కేటాయింపు తదితర అంశాలపై చర్చించారు.
కులవృత్తులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, ప్రభుత్వ చర్యలతో మత్స్య సంపద పెరిగిందని అన్నారు. చేపలు పట్టేవారికి ఆదాయం పెరిగి మంచి అభివృద్ధిని సాధిస్తున్నారని, చేపల చెరువులకు డిమాండ్ కూడా పెరిగిందని మంత్రులు చెప్పారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అప్పటికే మనుగడలో ఉన్న మత్స్యసహకార సంఘాలకు గ్రామ పంచాయతీల్లోని చిన్న, మధ్య తరహా చెరువులను లీజుకివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
కొత్తగా ఏర్పడ్డ గ్రామపంచాయతీల్లో కొన్ని సమస్యలు వస్తున్నాయని, వాటిని స్థానికంగానే నిబంధనలను అనుసరించి పరిష్కరించుకోవాలని మంత్రులు సూచించారు. ప్రభుత్వల సూచనల ప్రకారమే చెరువుల కేటాయింపులు జరిగేలా చూడాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, డీపీఓలను ఎర్రబెల్లి, తలసాని ఆదేశించారు.