పొగాకు నియంత్రణలో దేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ అమల్లోకి తెచ్చిన జీవోను దేశంలోని 25 రాష్ట్రాలు అనురిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. సిగరెట్, గుట్కా, గంజాయి, నికోటిన్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షాలాది మంది చనిపోతున్నారని... గ్రామీణ ప్రాంతాల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉందన్నారు.
వితంతువులుగా మారుతున్నారు..
వ్యసనాలకు బానిసైన భర్తలను కోల్పోవడం ద్వారా ఆడపిల్లలు చిన్న వయసులోనే వితంతువులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత పదార్థాలతో నోటి, గొంతు, దవడ క్యాన్సర్‌లతో అనేక మంది చనిపోతున్నారన్నారు. పొగ పీల్చేవారి సంఖ్య బాగా విపరీతంగా పెరిగిందన్నారు. పొగాకును అరికట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో చట్టం చేసి పక్కాగా అమలు చేస్తున్నట్లు మంత్రి తెల్చిచెప్పారు.
వైరస్ తీవ్రత నేపథ్యంలో..
పొగాకు, పొగాకు సంబంధిత పదార్థాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. బహిరంగ ప్రదేశాలు, విద్యా సంస్థల్లో పొగ తాగడాన్ని నిషేధించినట్లు ప్రకటించారు. పొగాకు నియంత్రణ కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో, రాష్ట్ర స్థాయిలలో ముఖ్య కార్యదర్శి నాయకత్వంలో అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని కూడా నిషేధించినట్లు వివరించారు.
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి..
ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పక్కవారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. గుడుంబా, గుట్కా, గంజాయి, నికోటిన్ నియంత్రణలో పోలీసు శాఖ అద్భుతంగా పనిచేస్తుందన్నారు. భవిష్యత్తులో తెలంగాణను పొగాకు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి ఈటల తెలిపారు.
ఇవీ చూడండి: రాత్రి 8 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచే ఉంటాయి