KTR Vs AP Ministers: ఏపీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర మంత్రులు స్పందించారు. కేటీఆర్.. తన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి గురించి స్నేహితుడు చెప్పింది కేటీఆర్ చెప్పారన్న బొత్స... తాను హైదరాబాద్ వెళ్లి ఉండి వస్తున్నానని అన్నారు. హైదరాబాద్‌లో అసలు కరెంటే ఉండటం లేదని చెప్పారు. తన వ్యాఖ్యలను కేటీఆర్ ఉపసంహరించుకోవాలని మంత్రి బొత్స డిమాండ్ చేశారు. బాధ్యత కలిగిన వ్యక్తి అలా మాట్లాడటం సరైంది కాదని అని హితవు పలికారు.
రాజకీయాల కోసమే కేటీఆర్ వ్యాఖ్యలు: ఎన్నికలు సమీపిస్తున్నందున రాజకీయాల కోసమే కేటీఆర్ ఆ వ్యాఖ్యలు చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఏపీలో విద్యుత్ కోతలు లేవని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. రైతులకు ఏడు గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని.. ఎక్కడైనా సాంకేతిక సమస్యతో పావుగంట మాత్రమే విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు.
"ఏపీలో కరెంట్, నీళ్లు లేవని కేటీఆర్కు తన ఫ్రెండ్ చెప్పారన్నారు. ఆయన చూడలేదు. నేను స్వయంగా హైదరాబాద్ నుంచే వస్తున్నా. అక్కడసలు కరెంటే లేదు. దానికి ఏం సమాధానం చెప్తారు. జనరేటర్ వినియోగించాం. బాధ్యత కలిగిన వ్యక్తిగా అలా మాట్లాడటం సరికాదు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా."
-బొత్స సత్యనారాయణ, ఏపీ మంత్రి
ఇవీ చదవండి: 'ఏపీలో కరెంట్, నీళ్లు, రోడ్లు ఏమీ లేవు.. అక్కడ ఉండలేక హైదరాబాద్ వస్తున్నారు..'