ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కమిటీ వేశామని.. పూర్తిస్థాయి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కలెక్టరేట్లో ఈ ఘటనపై సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి సుచరిత, మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసులు, కలెక్టర్ ఇంతియాజ్, తదితర అధికారులు పాల్గొన్నారు.
హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే 40 మంది అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారన్నారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
10 మంది మృతి.. 21 మంది క్షేమం
ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది మృతి చెందారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారన్నారు. తెల్లవారుజామున 4.45 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగిందని.. ఉదయం 5.09 గంటలకు అగ్నిమాపక శాఖకు ఫోన్ చేశారని వివరించారు. ఉదయం 5.13 గంటలకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి వచ్చారని.. వారి సత్వర స్పందనతో చాలామంది ప్రాణాలు నిలిచాయని చెప్పారు. ప్రమాదం నుంచి బయటపడిన 15 మందికి రమేశ్ ప్రధాన ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. మొత్తం 31 మంది రోగుల్లో 10 మంది చనిపోగా.. 21 మంది క్షేమంగా ఉన్నారన్నారు. ఆరుగురు సిబ్బంది క్షేమమేనని తెలిపారు.
నివేదిక రాగానే చర్యలు
అగ్నిప్రమాద ఘటనపై కమిటీ వేశామని.. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. 48 గంటల్లో పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని ఆదేశించామన్నారు. ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధరణ అయ్యిందని.. అదే కారణమైతే కనుక అత్యంత కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పూర్తిస్థాయి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఇదీ చూడండి : కాంగ్రెస్ వర్గీయుల బాహాబాహీ.. ఒకరిపై ఒకరి కేసులు