ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేసినందుకే భాజపా దృష్టి హైదరాబాద్‌పై పడిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఓవైసీ... ముంబయి ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించారు. ఉగ్రవాదానికి మతం ఉండదని... దానికి మతం జోడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంఐఎం మతతత్వ పార్టీ అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ కేవలం హక్కుల కోసం పోరాడుతుందన్నారు. మనసులు కలిపే ప్రయత్నం చేస్తుందని... విరిచేయత్నం చేయదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాజపా నేతలు స్థానిక సమస్యలను వదిలేశారని ఆరోపించారు. రోహింగ్యాలు, ఉగ్రవాదం, సర్జికల్ దాడుల గురించే ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. రాజ్యాంగబద్ధంగా మాట్లాడితే జిన్నాగా ప్రచారం చేస్తారా? అని ఓవైసీ ప్రశ్నించారు.