గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస తర్వాత అత్యధిక సీట్లు సాధించిన పార్టీ ఎంఐఎం. ఆ ఎన్నికల్లో తెరాస-ఎంఐఎం కలిసి పోటీ చేయనప్పటికీ అవగాహనతో ముందుకు వెళ్లాయి. ఇటీవల ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, సీఎం కేసీఆర్‌తో జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించినప్పుడు ఈసారీ అదేరీతిలో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కీలకమైన డివిజన్లలో ఏవిధంగా వ్యవహరించాలనే అంశంపై ఇరు పార్టీల మధ్య అవగాహన వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని డివిజన్లలో స్నేహపూర్వక పోటీకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్న ఎంఐఎం గత ఎన్నికల్లో సాధించిన డివిజన్ల సంఖ్యను పెంచుకోవటమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది.
సారి గోషామహల్పై గురి..
గత ఎన్నికల్లో 60 స్థానాలకు పోటీ చేసిన ఎంఐఎం.. కీలకమైన 44 చోట్ల విజయాన్ని అందుకుంది. ఈసారి అంతకంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఎన్నికల్లో పోటీచేసేందుకు ఉత్సాహం చూపుతున్న అభ్యర్థుల నుంచి సోమవారం నుంచే దరఖాస్తులు తీసుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో ఏడు స్థానాలు ఎంఐఎం ఖాతాలో ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో ఆ 7 నియోజకవర్గాల్లోని డివిజన్లపై దృష్టి సారించారు ఎంఐఎం నేతలు. మలక్ పేట్, చాంద్రాయణగుట్ట, కార్వాన్, బహదూర్‌పురా, చార్మినార్, యాకుత్‌పుర నియోజక వర్గాలు ఎంఐఎంకు కంచుకోట లాంటివి. ఇక్కడ ఆధిపత్యం చూపుతూనే ఇతర డివిజన్లపై పట్టు సాధించేందుకు ఆ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈసారి గోషామహల్‌లో పట్టు సాధించేందుకు అవసరమైన కసరత్తులు చేస్తోంది.
వీలైనన్ని డివిజన్లలో..
ఇటీవల బిహార్ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలిచిన ఉత్సాహంలో ఉన్న మజ్లిస్.. తమ బలాన్ని మరింత పెంచుకునేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తోంది. రాజేంద్రనగర్, అంబర్పేట్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లోని డివిజన్లపై కన్నేసింది. ఇక్కడా ఎంఐఎంకు భారీగా ఓటర్లు ఉండడం వల్ల తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. వీలైనన్ని డివిజన్లలో విజయం సాధించి పతంగి ఎగురవేయాలని గట్టి ప్రయత్నం చేస్తోంది.
సాధారణంగా శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం ఎక్కువగా సిట్టింగ్ అభ్యర్థులకే ప్రాధాన్యం ఇస్తుంది. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం గెలిచే సామర్థ్యం ఉన్న నేతలకే సీటు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం.