Migratory exotic birds Death: విదేశాల నుంచి ఏపీలోని శ్రీకాకుళం జిల్లా తేలినీలాపురం పక్షుల విడిది కేంద్రానికి వలస వచ్చిన పక్షులు అనూహ్య రీతిలో మృత్యువాత పడుతున్నాయి. రోజుకు పదుల సంఖ్యలో విదేశీ విహంగాలు ప్రాణాలు కోల్పోతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. తేలినీలాపురానికి రష్యాలోని సైబీరియా ప్రాంతం నుంచి పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షులు సెప్టెంబరులో వలస వస్తుంటాయి. ఏప్రిల్ వరకూ ఇక్కడే చెట్లపై గూడు కట్టుకుని నివసిస్తాయి. అయితే స్థానిక చెరువుల్లోని పెద్ద చేపల్ని తినే పెలికాన్ పక్షులు మాత్రం క్రమంగా మృత్యువాత పడుతున్నాయి.
birds death in srikakulam: చనిపోయిన పక్షుల్లో కొన్నింటికి అధికారులు పోస్టుమార్టం చేయించారు. పక్షులు తింటున్న చేపల్లో కొన్నింటిలో పురుగులు ఉన్నాయని, వాటి వల్ల వాటికి ఇన్ఫెక్షన్ సోకి చనిపోతున్నాయని ప్రాథమికంగా నిర్ధరించారు. కింద పడిపోతున్న పక్షులకు వెంటనే మందులు ఇచ్చి సపర్యలు చేస్తే బతికే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. విషపూరితమైన చేపల్ని తినడం వల్లనే ఈ పక్షులు ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు నివారణ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికైనా వైద్యులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి పక్షులు చనిపోకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.