Mess Charges in welfare schools : గురుకులాల్లో చదువుతున్న, సంక్షేమ వసతి గృహాల్లో ఆశ్రయం పొందుతున్న విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం తలెత్తరాదన్న ప్రభుత్వ ఆశయం నీరుగారుతోంది. పెరిగిన నిత్యావసరాల ధరలతో గిట్టుబాటు కాక అక్కడి చిన్నారులకు అందించాల్సిన మెనూ మార్పులకు గురి కావడమే దీనికి కారణం. ప్రస్తుత మెస్ ఛార్జీల మేరకు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.31.66 నుంచి రూ.50 ఖర్చుతో రెండు పూటల భోజనం, టిఫిన్, స్నాక్స్, గుడ్డు, మాంసాహారం అందించాలి.
ప్రభుత్వం రూపాయికే సన్నబియ్యాన్ని మంజూరు చేస్తున్నా, గత అయిదేళ్లలో నిత్యావసరాల ధరలు రెట్టింపు కావడంతో ప్రభుత్వమిచ్చే మెస్‌ఛార్జీలు సరిపోవడం లేదు. దీంతో గురుకుల, వసతి గృహాల్లో నిర్ణయించిన ఆహారపట్టిక, ప్రమాణాల మేరకు పౌష్టికాహార భోజనాన్ని అందించేందుకు మెస్‌ఛార్జీలు పెంచాలని గురుకుల ప్రిన్సిపాళ్లు, సంక్షేమవసతి గృహాల అధికారులు ఉన్నతాధికారులకు వివరిస్తున్నారు.
తగ్గుతున్న మాంసాహారం.. రాష్ట్ర ప్రభుత్వం అయిదేళ్ల క్రితం 2017-18లో మెస్‌ఛార్జీలను పెంచింది. అప్పటి వరకూ తరగతుల వారీగా నెలకు రూ.750 నుంచి రూ.1050 వరకు ఉన్న ఛార్జీలను నాటి ధరల సూచీని పరిశీలించి రూ.950 నుంచి రూ.1500కు పెంచారు. ఆ లెక్క ప్రకారం ఒక్కో విద్యార్థి కోసం రోజుకు రూ.31.66 నుంచి రూ.50 వరకు వెచ్చించనున్నట్లు నాడు ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఈ ధరలతో విద్యార్థులకు భోజనం అందించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కొన్ని గురుకులాల మెనూలో కొన్ని మార్పులు చేస్తున్నారు. మాంసాహారాన్ని తగ్గిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన గురుకులాల్లో విద్యార్థులకు భోజన బాధ్యతల్ని స్థానిక కేటరింగ్ సంస్థలకు అప్పగించారు. ప్రస్తుతం ధరలు పెరిగినందున... మెనూ ప్రకారం భోజనం అందించాలంటే ధరలు పెంచాలని, ప్రతినెలా బిల్లులు వెంటనే ఇవ్వాలని కేటరింగ్ కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.
అయిదేళ్లలో ధరల పెరుగుదల ఇలా..
- గుడ్డు రూ.2.50 నుంచి రూ.6.00కి పెరిగింది.
- గుడ్డు ఇవ్వని రోజున ఇచ్చే అరటి పండు ధర ఒక్కటి రూ.2 నుంచి రూ.4కి చేరింది.
- కిలో చికెన్ రూ.150 నుంచి రూ.300కి చేరింది. మాంసం కిలో రూ.800పైగా ఉంది.
- వంటనూనె ధర రూ.80 నుంచి రూ.180కి పెరిగింది.
- కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. పాలు, పప్పులు, ఇతర నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి.
పెంపుపై సంక్షేమశాఖల సమాలోచనలు.. నిత్యావసర ధరలు పెరగడంతో సంక్షేమశాఖలు, గురుకుల సొసైటీలు పరిస్థితిని అధ్యయనం చేస్తున్నాయి. ప్రస్తుత మెస్‌ఛార్జీలను 30 శాతం మేరకు పెంచితే విద్యార్థులకు ప్రస్తుత మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించేందుకు అవకాశాలుండొచ్చని భావిస్తున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించాయి.