ప్లాస్మా కరోనా బాధితుల పాలిట సంజీవనిగా నిలుస్తోందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్లాస్మాదాతలకు నిర్వహించిన సత్కార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ప్రస్తుతం కరోనాకు మందులేని పరిస్థితుల్లో అందరిలో అయోమయం నెలకొందని చిరంజీవి అన్నారు. కరోనా రోగులకు.. ప్లాస్మా ఇస్తే 99 శాతం బతికే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్లాస్మాలో ఉండే యాంటీబాడీల వల్ల కరోనా రోగులు కోలుకుంటారని చిరు పేర్కొన్నారు. ప్లాస్మా దానం చేయడం వల్ల.. రక్తం నష్టం అనేది ఉండదన్నారు. రక్తంలో ప్లాస్మా 24 నుంచి 48 గంటల్లో తిరిగి తయారవుతుందని వివరించారు. ప్లాస్మా దానంతో ఒక వ్యక్తి 30 మందికి ప్రాణదానం చేయవచ్చని చిరంజీవి అన్నారు.
చిరు ఇంట్లోనే నలుగురికి కరోనా..
ప్రతి ఒక్కరూ.. ప్రతి క్షణం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మెగాస్టార్ సూచించారు. తన ఇంట్లో పనిచేసే నలుగురు వ్యక్తులకు కూడా కరోనా వచ్చిందని వెల్లడించారు.
కరోనా వంటి సంక్షోభ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా సేవలందిస్తున్న పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంత మంచి కార్యక్రమానికి తనను ఆహ్వానించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వేళ పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు ఎనలేని సేవలందిస్తున్నారని ప్రశంసించారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ నిరాటంకంగా సాగుతోందన్నారు.
అపోహలు వద్దు..
కరోనా సోకినవారిని అవమానించొద్దని సీపీ సజ్జనార్ కోరారు. తలసేమియా రోగుల కోసం రక్తదానం కార్యక్రమం చేపట్టామని.. అందుకు చిరంజీవి ఎంతో సహాయపడ్డారని సీపీ తెలిపారు. కరోనా విజేతలు ధైర్యంగా ప్లాస్మా దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అపోహలు లేకుండా ప్లాస్మా దానం చేయాలని.. ప్లాస్మా దానం కూడా రక్తదానం లాంటిదేనని సజ్జనార్ అన్నారు.
ఇవీచూడండి : ప్లాస్మా దానం చేయాలని హీరో నాని విజ్ఞప్తి