మనుషులపై ఔషధాలు ఏ మేరకు పనిచేస్తాయనేది జన్యు వైవిధ్యాన్ని బట్టి అంచనా వేయొచ్చని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రతి రోగికి సరైన మోతాదు ఔషధం సూచించడానికి సీవైపీ2సీ9 జన్యువుల్లోని వైవిధ్యాలను తెలుసుకోవడం చాలా ముఖ్యమని తేల్చారు. మరింత అర్థవంతమైన క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ఇది ప్రధానమన్నారు. ప్రపంచం మొత్తానికి ఒక సాధారణ క్లినికల్ ట్రయల్ నిర్వహించడం ఉత్తమమైనది కాదని అధ్యయనం సూచిస్తోందని పరిశోధనకు నేతృత్వం వహించిన సీడీఎఫ్‌డీ డైరెక్టర్ డాక్టర్ తంగరాజ్ అన్నారు. మూర్ఛతోపాటు మరికొన్ని జబ్బుల్లో మందులను రాయడానికంటే ముందే జన్యు పరీక్ష చేయిస్తే ఆ ఔషధాలు పనిచేస్తాయో లేదో నిర్ధారణకు రావొచ్చని, ఫలితంగా వ్యక్తులను బట్టి సూచించవచ్చన్నారు. ఆరోగ్య సంరక్షణ ఇప్పుడు వ్యక్తిగత ఔషధాల వైపు కదులుతోందని, భారత్‌లో జన్యువైవిధ్యంపై తమ అధ్యయనాలు ఈ మార్పులో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా చెప్పారు.
ఆ జన్యువే కీలకం
కొవిడ్‌తో సహా వివిధ ఔషధాల పనితీరు తెలుసుకునేందుకు భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఔషధ జీవక్రియ(డ్రగ్ మెటబాలిజం)కు దోహదం చేసే జన్యువుల వైవిధ్యాలను అధ్యయనం చేయడం కీలకంగా మారింది. సీసీఎంబీ నుంచి డాక్టర్ కె.తంగరాజ్, అతని బృందం సైటోక్రోమ్-పి450-2సి9(సీవైపీ2సీ9) అధ్యయనం చేశారు. యాంటీ ఎపిలెఫ్టిక్, ఫెనిటోయిన్, లోసార్టాన్ల వంటి విస్తృత శ్రేణి ఔషధాల జీవక్రియకు ఈ జన్యువే కీలకం. జన్యుక్రమంలో మార్పులతోపాటు మానవ కాలేయంలో ప్రొటీన్ ఉత్పత్తిని ఇది ప్రభావితం చేస్తుంది. ఇది నెమ్మదిగా ఔషధాల జీవక్రియకు కారణమవుతుంది. లేదంటే వికటిస్తుంది. ఈ ఔషధాలను ఎక్కువసేపు శరీరంలో ఉంచినప్పుడు విష ప్రక్రియకు దారితీస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తికి వారి సీవైపీ2సీ9 జన్యువు క్రమాన్ని బట్టి సరైన మోతాదు నిర్ణయించడం ముఖ్యమని తేల్చారు.
అధ్యయనం ఇలా సాగింది..
ప్రస్తుతం సీడీఎఫ్‌డీ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ తంగరాజ్ బృందం 36 జన సమూహాల నుంచి 1,488 మంది భారతీయుల్లో ఈ జన్యు వైవిధ్యాన్ని అధ్యయనం చేసింది. వివిధ భాషా సమూహాలు, కులాలు, తెగలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. దక్షిణాసియాలోని ఇతర దేశాల నుంచి 1,087 వ్యక్తుల జన్యువులను గుర్తించి విశ్లేషించారు. ఈ క్రమంలో సీవైపీ2సీ9 జన్యువులో 8 కొత్త రకాలు(వేరియంట్లు) ఉన్నాయని, దక్షిణాసియాలో 11 రకాలున్నాయని కనుగొన్నారు. భాషా, భౌగోళిక జనసమూహాలలో ఈ రకాలతో దేనికీ సంబంధం లేదని గుర్తించారు. కొందరు భారతీయుల్లో 20 శాతం కంటే ఎక్కువ మందిలో సీవైపీ2సీఏ రకం, సీవైపీ2సీ9 జన్యువు ఉందని గుర్తించారు. వీరిలో ఔషధాల జీవక్రియ సమర్థత తక్కువగా ఉందన్నారు. సీవైపీ2సీ9 నిర్మాణం వైద్యులకు తెలియడం ద్వారా ప్రతి రోగికి సరైన మందును నిర్దేశించవచ్చన్నారు. పరిశోధన ఫలితాలు ఫార్మాకోజినోమిక్స్ అండ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి.