పెద్దల సమక్షంలో పెళ్లి జరగడం.. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులంతా వచ్చి ఆశీర్వదించడం.. శక్తి మేర భోజనాలు..బాజా భజంత్రీలు, ఊరేగింపులు ఇలా పెళ్లి జరిగితే సరిపోయేది. అయితే చట్టపరంగా హక్కులు సంక్రమించాలంటే మాత్రం ఆ పెళ్లికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అప్పుడే ఆ పెళ్లికి చట్టబద్ధత(Marriage registration) వస్తుంది. విదేశాలకు వెళ్లినప్పుడు భార్యాభర్తలుగా నిర్ధారించే ధ్రువపత్రంగా ఉపయోగపడుతుంది. బహుళ ప్రయోజనకరంగా ఉండడంతో ఏటా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మూడుముళ్ల బంధాల నమోదు(Marriage registration) పెరుగుతోంది.
మేడ్చల్ మల్కాజగిరి జిల్లాలో అధికంగా..
గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కంటే ఈ విషయంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ముందుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2016లో 30,552 జంటలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నమోదు చేసుకోగా. 2020లో ఈ సంఖ్య మూడింతలు అంటే 97,149కు చేరుకుంది. రిజిస్ట్రేషన్ శాఖలో నమోదుకు రూ.200లు దరఖాస్తు ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్లో స్లాట్ బుక్ చేసుకుని వెళ్తే గంటలో నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. దశాబ్దాల క్రితం పెళ్లి చేసుకున్న వారు కూడా ఇప్పుడు నమోదు చేసుకోవచ్చు.
![](https://assets.eenadu.net/article_img/3b_23.jpg)