Mallu Ravi Fires on Sangareddy Collector : ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినవ అంబేడ్కర్ అంటూ సంగారెడ్డి కలెక్టర్ శరత్ కీర్తించడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. బాబాసాహెబ్‌ను సీఎంలో చూస్తున్నానని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ఐఏఎస్ అధికారి ఇలా మాట్లాడటం అంబేడ్కర్‌ను అవమానించడమే అవుతుందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ చెప్పినందుకే ఇలా పొగిడారా అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన ఇవ్వాల్సిన గిరిజన రిజర్వేషన్లు 8 ఏళ్లుగా ఇవ్వకుండా ఆపి గిరిజనులకు తీవ్ర నష్టం చేసిన కేసీఆర్ ఏ విధంగా అభినవ అంబేడ్కర్ అవుతారని ప్రశ్నించారు.
Mallu Ravi Fires on Collector Sharat : ఎన్నికల ముందు దళితులకు, గిరిజనులకు కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వనందుకు కేసీఆర్ అభినవ అంబేడ్కర్ అయ్యారా అని కలెక్టర్ శరత్‌ను మల్లురవి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పేరును మార్చి ఆ మహానుభావుడిని అవమానపరిచినుందుకా అని అడిగారు. దళితుడిని సీఎం చేస్తానని, చెయ్యకపోతే తల నరుక్కుంటానని హామీ ఇచ్చి మోసం చేసినందుకు కేసీఆర్ అభినవ్ అంబేడ్కర్ అయ్యారా అని మల్లు రవి నిలదీశారు.
"కాంగ్రెస్ ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఖర్చు చేయాల్సి నిధులను 62 వేల కోట్లు క్యారీ ఫర్వార్డ్ చేసి ఆ ప్రాంతాలను అభివృద్ధికి దూరం చేసినందుకా.. ? ఎందుకు కేసీఆర్ అభినవ అంబేడ్కర్ అయ్యారో ఐఏఎస్ ఆఫీసర్ శరత్ చెప్పాలి. రాజకీయ నాయకుల్లాగా ఉన్నత పదవుల్లో ఉండే వారు కూడా ఇలా మాట్లాడితే ఇక ప్రజలకు సేవలేం చేస్తారు..? కలెక్టర్ వెంటనే తన మాటలను ఉపసంహరించుకోవాలి." అని మల్లు రవి డిమాండ్ చేశారు.