Mallu Ravi Comments On KCR : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్టును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ఖండించారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. పోలీసులను సొంత ఆర్మీలా వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల ద్వారా ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణం లేకుండా రేవంత్ రెడ్డిని గృహనిర్బంధం చేశారని ధ్వజమెత్తారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా ఆంక్షలు పెడుతున్నారని విమర్శించారు.
Mallu Ravi Comments On Revanth Arrest : 'తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నిషేధించారా? ఒకవేళ నిషేధిస్తే ఆ దిశగా ఆదేశాలు జారీ చేయండి. అంతేగానీ.. పదేపదే అరెస్టులతో హింసించకండి. కాంగ్రెస్ నేతలను అవమానించకండి. రేవంత్ రెడ్డి సహా.. జిల్లాల్లో కాంగ్రెస్ నేతలను ఎందుకు నిర్బంధిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ.. తెలంగాణను ఇచ్చిన పార్టీతో తెరాస సర్కార్ వ్యవహరిస్తున్న తీరు సరికాదు. బంధువులను పరామర్శించడానికి కూడా వెళ్లకూడదా? మంత్రులు, ఎమ్మెల్యే ఇళ్లకు శుభకార్యాలు, పరామర్శలకు కేసీఆర్ వెళ్తారు.. మరి మమ్మల్నెందుకు అడ్డుకుంటున్నారు. ఉద్యోగ బదిలీలతో మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించిన ఓ ఉద్యోగి ఇంటికి పరామర్శించడానికి వెళ్లాలనుకున్న రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి ఇంట్లోకి చొచ్చుకుపోయి గృహనిర్బంధం చేశారు.'
- మల్లు రవి, కాంగ్రెస్ సీనియర్ నేత
Mallu Ravi Comments On CM KCR: తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను ప్రజాక్షేత్రంలో తిరగనీయకుండా.. అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని మల్లు రవి తెలిపారు. ఎక్కడికక్కడ తెరాస నాయకుల్ని ఎదుర్కోవాలని విజ్ఞప్తి చేశారు. కారణాలు లేకుండా కాంగ్రెస్ నాయకుల్ని పదేపదే అడ్డుకుంటూ నిర్బంధిస్తున్న తెరాస సర్కార్‌పై కాంగ్రెస్ తిరగబడుతుందని చెప్పారు. ఈ విధంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని హస్తం శ్రేణులకు పిలుపునిచ్చారు.