రాష్ట్ర సామాజిక, ఆర్థికాభివృద్ధిలో నాబార్డు క్రియాశీలక పాత్ర పోషిస్తోందని సంస్థ తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ వై.వి.రావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, బంగారు తెలంగాణ సాధనకు రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రూపాల్లో తోడ్పాటును అందిస్తోందన్నారు. రాష్ట్రంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి వివిధ బ్యాంకుల ద్వారా రూ.13,915 కోట్ల పంటరుణాలు, వ్యవసాయ పెట్టుబడి రుణాలను అందజేసిందని తెలిపారు. రైతు ఉత్పాదక సంఘాలను మార్కెటింగ్ సదుపాయల కోసం వివిధ కార్పొరేట్ సంస్థలతో అనుసంధానం చేస్తున్నామన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ప్రగతి నివేదికను నాబార్డు గురువారం విడుదల చేసింది.
ముఖ్యాంశాలు ఇలా...
- రాష్ట్రంలో గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.6,633 కోట్ల రుణం మంజూరు. ఈ మొత్తంలో రూ.4,600 కోట్లు మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం కేటాయించగా రూ.2,394 కోట్లు ఇప్పటికే అందజేసింది.
- పౌరసరఫరాలశాఖకు ధాన్యం సేకరణ కోసం రూ.2,500 కోట్ల రుణం మంజూరు.
- ఆర్థిక తోడ్పాటు కార్యక్రమాల్లో భాగంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.16,312కోట్లను అందించగా గత ఆర్థికసంవత్సరంలో రూ.20,549కోట్లు ఇచ్చింది.
- వ్యవసాయ, వ్యవసాయేతర కార్యక్రమాలకు రూ.41 కోట్ల గ్రాంట్లు.