అమీర్‌పేట.. తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల పల్లెల నుంచి సైతం వేల మంది యువతీ యువకులు ఇక్కడికి తరలివచ్చేవారు. విదేశీ కొలువులు, విద్యాసంస్థల్లో సీట్ల సాధనకు తమ నైపుణ్యాన్ని పెంచుకునేందుకు వివిధ కోర్సుల్లో శిక్షణకు చేరేవారు. ప్రైవేటు వసతిగృహాల్లో ఉంటూ.. తాత్కాలిక ఉద్యోగాలు చేసుకుంటూ శిక్షణ పొందేవారు.
అమీర్‌పేట మైత్రీవనం పరిసరాల్లోని రహదారులు ఉత్సాహం ఉరకలెత్తే యువతీ యువకులతో కిటకిటలాడేవి. కరోనా మహమ్మారి కారణంగా శిక్షణ సంస్థలు, వసతిగృహాలు మూతపడ్డాయి. తాత్కాలిక కొలువులూ పోయాయి. యువత సొంతూళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం అమీర్‌పేట ఇలా బోసిపోతోంది. కరోనా ఉద్ధృతి తగ్గి మళ్లీ కళకళలాడే రోజుల కోసం ఇక్కడి శిక్షణ సంస్థలు ఎదురుచూస్తున్నాయి.