త్రినేత్రుడు, త్రిగుణాతీతుడు అయిన పరమేశ్వరుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం. శివరాత్రి నాడు తెలిసో తెలియకో ఓ మారేడు దళాన్ని శివలింగం మీదకు విసిరేసినందుకే చాలామంది భక్తులకు ఆ జన్మలోని పాపాలన్నీ నశించి ఉత్తర జన్మలన్నీ ఉత్తమోత్తమ జన్మలుగా లభించాయి. మన పురాణాల్లో ఇలా కేవలం మారేడు దళాలను శివలింగానికి అర్పించి సులభంగా పుణ్యాన్ని సంపాదించిన భక్తుల సంఖ్య అధికంగానే కనిపిస్తుంది. శివాలయాలలో నిత్యం బిల్వార్చనలు (మారేడు దళాలతో అర్చనలు), పర్వ దినాలప్పుడు లక్ష బిల్వార్చనలు జరుపుతుంటారు.
శివ పురాణంలో..
ఇలా చేయటమంతా మారేడు విశిష్టతకు ప్రతీకగా కనిపిస్తుంది. ‘మారేడు (మారాజు) నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు’ అని తెలుగు కవులు మారేడు పదాన్ని శ్లేషార్థంగా చెప్పిన సందర్భాలు సాహిత్యంలో చాలా చోట్ల ఉన్నాయి. ఇలాంటి మారేడు చెట్టు మహిమను గురించి శివ పురాణం విద్యేశ్వర సంహిత సాధ్యసాధన ఖండం ఇరవై రెండో అధ్యాయం ఇలా వివరిస్తోంది. ఈ వివరణలోనే శివభక్తులలో ఉన్న ప్రవృత్తి, నివృత్తిపరుల భక్తి విశేషాలు కూడా కనిపిస్తున్నాయి. కార్తిక మాసం నేపథ్యంలో శివుడికి అత్యంత ఇష్టమైన మారేడు విశిష్టత ఇదే!
ఇలా చేస్తే పుణ్యఫలం..
మారేడు చెట్టు మహాదేవుడి స్వరూపం. ఆ చెట్టును దేవతలంతా స్తుతిస్తుంటారు. లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు పాదులో ఉంటాయి. ఆ చెట్టు మూలంలో లింగ రూపంలో ఉన్న మహాదేవుడైన శివుడిని పూజించటం ఎంతో పుణ్యప్రదం. ఆ చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వ తీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అలా స్నానం చేసిన వాడే అసలైన పవిత్రుడని పురాణాలలో పలుచోట్ల చెప్పటం కూడా ఉంది. ఆ చెట్టు కుదురు ఎంతో గొప్పది. అది నీటితో తడిసి ఉన్నప్పుడు మహాదేవుడు చూస్తే ఆయనకెంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. శివుడి అనుగ్రహం సంపాదించాలంటే మారేడు చెట్టు మొదలును నిత్యం నీటితో తడుపుతున్నా సరిపోతుంది. గంధ పుష్పాదులతో ఆ మూలాన్ని పూజించిన వారు శివలోకార్హతను పొందుతారు. ఆ భక్తుల ఇంట సంతానం, సుఖం వర్థిల్లుతూ ఉంటుంది.
వృక్షం కింద ఒక్క భక్తుడికి భోజనం పెట్టినా..
మారేడు చెట్టు మొదట్లో శ్రద్ధతో వరుసగా దీపాలను పెట్టిన వారికి తత్వజ్ఞానం లభించి అంత్యంలో మహేశ్వరుడిలో ఐక్యమయ్యే అదృష్టం కూడా లభిస్తుంది. కొత్త చిగుళ్లతో ఉన్న మారేడు కొమ్మను తాకటం, ఆ చెట్టును పూజించటం లాంటివి పాప విముక్తికి దోహదకారులు. అలాంటి పవిత్రమైన వృక్షం కింద ఒక్క భక్తుడికి భోజనం పెట్టినా కోటిరెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఆ చెట్టు కింద పాలు, నెయ్యితో వండిన పరమాన్నాన్ని శివభక్తుడికి పెడితే అది మొదలు ఇంకా ఎప్పటికీ ఏ జన్మలోనూ అలా పరమాన్నం పెట్టిన వాడికి దరిద్రం అనేది ఉండదు. శివ నైవేద్యంగా లభించే ఈ మారేడు దళాన్ని పొందిన వాడు మహా పుణ్యాత్ముడవుతాడు. శివ ప్రసాదంలో పత్రం, పుష్పం, ఫలం, జలం లాంటివన్నీ సాలగ్రామ స్పర్శ, శివలింగ స్పర్శవల్ల అవి ఎంతో పవిత్రతను సంతరించుకుంటాయి.
భిక్షాటనతో లభించిన ఆహారం నైవేద్యంగా..
శివపూజ చేసే వారిలో ప్రధానంగా రెండు రకాల వారుంటారు. ఆ ఇద్దరికీ ఈ మారేడు దళాలు శివలింగమంత విలువైనవే. ప్రవృత్తి నివృత్తి అనే రెండు భక్తి మార్గాలలో భక్తులు శివపూజ చేస్తుంటారు. ప్రవృత్తి మార్గాన్ని అనుసరించే వారు శివలింగ పీఠాన్ని పూజిస్తారు. అలా చేయటం వల్ల వారికి సర్వ దేవతలను పూజించినంత ఫలం లభిస్తుంది. అలాంటి భక్తులు అభిషేకం చేసి నాణ్యమైన బియ్యంతో వండిన అన్నాన్ని నైవేద్యం ఇస్తుంటారు. పూజ అయిన తర్వాత ఆ లింగాన్ని శుద్ధి చేసి సంపుటిలో పెట్టి పవిత్రమైన ప్రదేశంలో భద్రపరుస్తుంటారు. నివృత్తి మార్గాన్ని అనుసరించే భక్తులు చేతిలోనే శివలింగాన్ని ఉంచుకొని పూజించి భిక్షాటనతో లభించిన ఆహారాన్ని ఆ శివలింగానికి నైవేద్యం పెడతారు.
ఔషధీయ గుణాలు..
ఓంకారాన్ని సూక్ష్మ లింగంగా భావించి ఉపాసించటం నివృత్తి పరులలో కనిపించే మరో ప్రత్యేకత. ఆ భక్తులు లింగాన్ని విభూతితో అర్చించటం, ఆ విభూతిని నైవేద్యంగా ఇవ్వటం కూడా ఉంది. అలాగే పూజ అయిన తర్వాత శివలింగాన్ని సర్వదా శిరస్సు మీదనే ధరిస్తూ ఉంటారు. ఇలా ఈ కథా సందర్భంలో మారేడు చెట్టు మహిమ గురించి శివభక్తులలోని ప్రవృత్తి, నివృత్తి అనే మార్గాలననుసరించే భక్తులను గురించి వివరించటం కనిపిస్తుంది. మారేడు వృక్షం ఇంత పవిత్రతను సంతరించుకొని ఉండటానికి ఆ చెట్టు దళాలు, బెరడు అన్నిటిలోనూ ఔషధీయ గుణాలు ఉన్నాయని ఆధునిక శాస్త్రవేత్తలు విశ్లేషించి చెబుతున్నారు.
ఇదీ చదవండి : సరైన నిర్ణయాలు తీసుకోవడమెలాగో మీకు తెలుసా?