తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఖాజానా నింపుతున్న శాఖల్లో వాణిజ్య పన్నుల శాఖ తరువాత స్థానం ఆబ్కారీ శాఖది. ఏటికేడు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరగడం వల్ల.. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలు, మరో వెయ్యికిపైగా బార్లు, క్లబ్‌లు, పబ్‌లు ఆబ్కారీ శాఖ లైసెన్స్ పొంది ఉన్నాయి.
రూ. 27,289 కోట్లు
ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన తరువాత రాష్ట్రంలో 2014-15 ఆర్థిక ఏడాదిలో రూ.10,883 కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోయింది. 2015-16 ఆర్థిక ఏడాదిలో రూ.12,706 కోట్ల విలువైన విక్రయాలు జరిగాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.14,184 కోట్లు, 2017-18 ఆర్థిక ఏడాదిలో రూ.17,597 కోట్లు, 2018-19 ఆర్థిక ఏడాదిలో రూ.20,859 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.22,605 కోట్ల విలువైన 3.48 కోట్ల కేసుల లిక్కర్, 4.92 కోట్లు కేసుల బీరు అమ్ముడు పోయింది. అదే ఈ ఆర్థిక ఏడాది 2020-21లో రూ.27,289 కోట్ల విలువైన 3.35 కోట్ల కేసుల లిక్కర్, 2.73 కోట్ల కేసుల బీరు విక్రయాలు జరిగాయి. ఈ రెండు ఆర్థిక ఏడాదుల్లో జరిగిన అమ్మకాలను పరిశీలిస్తే.. 13 లక్షల కేసుల లిక్కర్, 2.19 కోట్ల కేసులు బీరు అమ్మకాలు తగ్గాయి.
అందుకే తగ్గాయి..
యువత ఎక్కువ ఇష్టపడే బీరు అమ్మకాలు.. కరోనా ప్రభావంతో సగానికి తగ్గాయి. ఐటీ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌లో ఐదు లక్షలకుపైగా ఐటీ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు ఉండగా ఇందులో 80 నుంచి 90 శాతం మందికి ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు కల్పించారు. దీని వల్ల బీరు అమ్మకాలు ఉన్నఫలంగా పడిపోయాయని ఆబ్కారీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక లాక్‌డౌన్, కరోనా ప్రభావాలతో దాదాపు నెలన్నర రోజులు మద్యం దుకాణాలు మూతపడటం వల్ల.. ఆ ప్రభావం కూడా మద్యం అమ్మకాలపై పడింది. అయినా మద్యం ధరలు సగటున 20శాతం పెరగడం వల్ల మద్యం క్వాంటిటీ పడిపోయినా విలువ ఐదు వేల కోట్లకు పైగా పెరిగింది. ఇక జిల్లాల వారీగా తీసుకుంటే... రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో.. పదివేల కోట్లు విలువైన మద్యం అమ్ముడు పోగా మిగిలిన 17 వేల కోట్లు విలువైన మద్యం రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో అమ్ముడుపోయింది.
రూ.30వేల కోట్లు!
ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉండడం, పాపులర్ బ్రాండ్ మద్యం అందుబాటులో లేకపోవడం వల్ల హైదరాబాద్‌తోపాటు సరిహద్దు జిల్లాలైన మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి లిక్కర్ పెద్ద ఎత్తున సరఫరా అయినట్లు తెలుస్తోంది. దీనివల్లే నల్గొండ జిల్లాలో రూ.3 వేల కోట్లకుపైగా మద్యం అమ్ముడుపోగా ఖమ్మం, మహబూబ్‌నగర్ రెండు జిల్లాలో దాదాపు నాలుగున్నరవేల కోట్ల రూపాయలు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. కరోనా ప్రభావం, లాక్‌డౌన్ విధించనట్లయితే ఈ ఏడాది రూ.30వేల కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోయి ఉండేదని ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేశారు.
- ఇదీ చదవండి : బెంగళూరులో తీగ లాగితే.. తెలంగాణలో కదిలిన డొంక!