కరోనా రక్కసితో కొట్టుమిట్టాడుతున్న మహారాష్ట్రకు.. కొవిడ్ రోగుల కోసం అత్యంత శీతల ఉష్ణోగ్రతల మధ్య ఆక్సిజన్ పంపడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగార అధికారులు పూర్తి చేస్తున్నారు.
మహారాష్ట్ర నుంచి ఖాళీ ట్యాంకర్లు..
మహారాష్ట్రలోని కలంబొలి ప్రాంతం నుంచి ఏడు ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్ లారీలతో ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’ రైలు బయలుదేరిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర నుంచి స్టీల్‌ప్లాంట్‌కు ఆక్సిజన్ సేకరణ కోసం.. ఈ ఉదయం ప్రత్యేక రైలు ఖాళీ ట్యాంకర్లతో చేరింది.
'యుద్ధప్రాతిపదికన నింపుతున్నాం'
ఆక్సిజన్‌కు అధికంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన అన్ని జాగ్రత్తలతో ట్యాంకర్లలోకి ప్రాణవాయువును నింపినట్లు ప్లాంట్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పనులు ముగింపు దశకు వచ్చినట్లు పేర్కొన్నారు. మొత్తం 7 ట్యాంకర్లలో వంద టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ పంపనున్నారు.
రో-రో సర్వీస్..
ఆక్సిజన్ ట్యాంకర్లతో వచ్చే రైలును రో-రో సర్వీసుగా పేర్కొంటున్నారు. రైలుపై ఉన్న ట్యాంకర్ లారీలు నేరుగా ఆక్సిజన్ ప్లాంట్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం విశాఖ ఉక్కు కర్మాగారం రోలింగ్ మిల్స్ ప్రాంతంలో ప్రత్యేకంగా రైలు పట్టాలపై యుద్ధప్రాతిపదికన ర్యాంపు నిర్మాణం పూర్తి చేశారు. రైలు ఈ ర్యాంపు దగ్గరికి వచ్చిన తర్వాత ఆక్సిజన్ లారీలు రైలుపై నుంచి రహదారిపైకి వస్తాయి. అక్కడి నుంచి కర్మాగారంలోని ఆక్సిజన్ ప్లాంట్ వద్దకు తీసుకెళ్తారు.
సుమారు 100 టన్నుల ఆక్సిజన్ లిక్విడ్..
వైద్య పరమైన అవసరాలకు వీలుగా అధికారులు లిక్విడ్ ఆక్సిజన్‌ను సిద్ధం చేశారు. ఆ ఏడు ట్యాంకర్లలో సుమారు వంద టన్నులకు పైగా లిక్విడ్ ఆక్సిజన్‌ను నిల్వ చేస్తారు. అత్యంత శీతల స్థితిలో మైనస్ 183 డిగ్రీల వద్ద ఆక్సిజన్‌ను నిల్వ చేయాలి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు ఉక్కు కర్మాగారంలో ఉన్నాయి. రైల్లో తరలించేటప్పుడు కూడా అదే శీతల ఉష్ణోగ్రతలు ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.
- ఇదీ చదవండి : ఆస్పత్రి మెట్ల వద్ద.. భార్య ఒడిలోనే కరోనా రోగి మృతి