తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై జోక్యం చేసుకుని, న్యాయం చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లేఖ రాశారు. నల్గొండ ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఎంఎ ఖాన్‌ల సంతకాలతో ప్రధానికి లేఖ పంపారు. రాష్ట్ర ప్రభుత్వం 49 వేలకుపైగా ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబాల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తోందని పేర్కొన్నారు.
వేలకోట్ల ఆస్తులు, విలువైన భూములున్నా.. అప్పులయ్యాయట..!
ఆర్టీసీ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు, విలువైన స్థలాలు, భూములు ఉన్నాయని లేఖలో తెలిపారు. తెరాస ప్రభుత్వం కావాలనే ఆర్టీసీ సంస్థను నిర్లక్ష్యం చేస్తోందని ఎంపీలు ఆరోపించారు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీ సొమ్ము ఇవ్వకుండానే ఆర్థికంగా నష్టాల్లో పడేలా చేసిందని వెల్లడించారు. యాభై రెండు రోజుల పాటు సమ్మె చేసిన కార్మికుల్లో దాదాపు 30మందికి గుండెపోటు వచ్చి ఆస్పత్రి పాలయ్యారని, మరికొంత మంది మనో వేధనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారని లేఖలో వివరించారు.
వారు చేశారు.. మీరెందుకు చేయరు..?
పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఆర్టీసీలో 33 శాతం వాటా కలిగి ఉందని.. తక్షణమే జోక్యం చేసుకుని ఆర్టీసీ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకొని, వారి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.