పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని అమలుచేయనున్నట్లు మంత్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పురపాలికల్లో మొక్కలు నాటి సంరక్షించడానికి ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు విరివిగా మొక్కలు నాటి భవిష్యత్తు తరాలకు పచ్చదనాన్ని కానుకగా అందించాలని ఆయన పిలుపునిచ్చారు.
పట్టణాల్లో 12.5 కోట్ల మొక్కలు నాటాలి
ఆరో విడత హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ఈ ఏడాది 12.5 కోట్ల మొక్కలను నాటాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్ ఆదేశించారు. ఇందులో హెచ్‌ఎండీఏ పరిధిలో ఐదు కోట్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో రెండున్నర కోట్లు, మిగిలిన నగరాలు, పురపాలక పట్టణాల్లో ఐదు కోట్ల మొక్కలను నాటాలన్నారు. బుధవారం పురపాలకశాఖ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలసి పురపాలక కమిషనర్లతో అర్వింద్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
యాదాద్రి మోడల్ ప్లాంటేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి
పట్టణప్రాంతాల్లో పచ్చదనం పెంపునకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సూచనలను, కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అర్వింద్‌కుమార్ వివరించారు. తక్కువ కాలంలో ఎక్కువ పచ్చదనానికి అవకాశం కల్పించే యాదాద్రి మోడల్ ప్లాంటేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రానున్న ఆరునెలల్లో 500 యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ పార్కులు, 700 ట్రీ పార్కులు ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ సందేహానికి ప్రధాని స్పష్టత