'రాష్ట్రాభివృద్ధికి మండలి విఘాతంగా మారింది...కీలకమైన బిల్లులను అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. అత్యున్నత స్థాయిలో చర్చ జరగాల్సిన చోట రాజకీయాలు చేస్తున్నారు'..శాసనమండలి కొనసాగింపుపై ఇది రాష్ట్ర ప్రభుత్వం వాదన. శాసనసభ ఆమోదించిన వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిన మరునాటి నుంచే మండలి రద్దుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలకు అడ్డంకిగా మారిందన్న కారణంతో మండలి రద్దు దిశగా అడుగులేసింది. అంతే వేగంతో నేటి కేబినెట్ భేటీలో మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేయటమే కాకుండా శాసనసభ ఆమోదాన్ని తెలిపింది.
శాసనసభ ఆమోదం....
ఉదయం మండలిని రద్దు చేస్తూ చేసిన కేబినెట్ తీర్మానాన్ని ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో ప్రవేశపెట్టారు. తీర్మానంపై సభాపతి చర్చకు అనుమతి ఇచ్చారు. ప్రతిపక్ష తెదేపా అసెంబ్లీకి దూరమని స్పష్టం చేయడంతో అధికార పార్టీ సభ్యులతో పాటు జనసేన ఎమ్మెల్యే తీర్మానంపై మాట్లాడారు. సభలో ప్రసంగించిన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ తీర్మానాన్ని బలపరిచారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిగా మారుతున్న విధాన పరిషత్‌ను రద్దు చేయాలని కోరారు. జనసేన తరపున గెలిచిన రాపాక వరప్రసాద్ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పూర్తి మద్దతు తెలిపారు.
రాజకీయాలకు కేంద్రంగా మారింది...
రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన మండలి...అలాంటి వాటికి కేంద్రంగా మారిందని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మండలిని పునరుద్ధరిస్తే..నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సభ సాక్షిగా తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. సభలో నాడు చంద్రబాబు మాట్లాడిన వీడియో టేపులను ప్రదర్శించారు. తీర్మానంపై మాట్లాడిన సీఎం జగన్ ...ప్రతిపక్ష నేత చంద్రబాబే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మండలిలో చేసిన సవరణలను శాసనసభ ఆమోదించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. విధాన పరిషత్ రద్దు తీర్మానానికి ప్రతి ఒక్కరూ మద్దతిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు తన ప్రసంగాన్ని ముగించారు.
తీర్మానంపై ఓటింగ్..
మండలి రద్దుపై తీర్మానంపై శాసనభలో ఓటింగ్ చేపట్టారు. మంత్రులు మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ మినహా మిగతా సభ్యులందరూ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. 133మంది సభ్యులు మండలి రద్దుకు మద్దతు తెలిపారు. దీంతో తీర్మానం ఆమోదం పొందినట్లు ప్రకటించిన సభాపతి తమ్మినేని సీతారాం.. శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు. మండలి రద్దు తీర్మానం కేంద్రానికి చేరనుంది. దీంతో రాష్ట్రానికి సంబంధించినంత వరకూ మండలి కథ ముగిసినట్లే..! కేంద్రం తీసుకునే నిర్ణయంపై మండలి భవితవ్యం ఆధారపడి ఉంటుంది.