ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి.. అధికారబలంతో సాక్షులను ప్రభావితం చేయగలరని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు తరఫు న్యాయవాది సీబీఐ కోర్టుకు నివేదించారు. అక్రమాస్తుల కేసుల్లో.. సహ నిందితులుగా ఉన్నవారందరికీ కీలక పదవులు కట్టబెట్టారని, సాక్షులను భయపెట్టడానికి, ప్రలోభపెట్టడానికి అన్ని రకాలుగా అవకాశాలున్నాయని చెప్పారు. అందువల్ల ఆయన బెయిలును రద్దు చేయాలని కోరారు. అక్రమాస్తుల వ్యవహారంలో ప్రధాన నిందితుడైన జగన్ బెయిలును రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం రోజున సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్.మధుసూదన్‌రావు విచారణ చేపట్టారు.
రఘురామకృష్ణరాజు వేసిన కౌంటరులో కొత్త అంశాలున్నాయని, వాటికి సమాధానం దాఖలు చేయడానికి గడువివ్వాలన్న జగన్ తరఫు న్యాయవాది అభ్యర్థనను తిరస్కరించారు. రఘురామ తరఫున న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ రాజకీయ బలంతో సాక్షులను ప్రభావితం చేస్తారన్నారు. ఈ కేసుల్లో నిందితులకు కీలక పోస్టులు అప్పగించారని, దీనివల్ల సాక్షుల్లో భయం సృష్టించడానికి అవకాశాలున్నాయన్నారు. తనకు అనుకూలంగా వ్యవహరించని ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను ఇబ్బందులకు గురి చేశారని, ఆయన కూడా ఈ కేసులో సాక్షిగా ఉన్నారని చెప్పారు. కేసు విచారణ ముందుకు సాగకుండా చూస్తున్నారన్నారు. జగన్ బెయిలును రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేసే అర్హత తమకు ఉందన్నారు. రాతినాం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తాను పిటిషన్ దాఖలు చేయవచ్చన్నారు.
బెదిరించినట్లు ఒక్క సాక్షీ చెప్పలేదు
జగన్ తరఫున న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ రాజకీయ బలంతో సాక్షులను ప్రభావితం చేస్తారని అంటున్నారని, ఇప్పటివరకు బెదిరించినట్లు ఏ ఒక్క సాక్షీ చెప్పలేదన్నారు. నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారంలో రాజకీయంగా సహకరించలేదని వేధించారని పిటిషనర్ అంటున్నారని, అంతేగానీ సాక్షి అయినందున బెదిరించారని చెప్పడం లేదని గుర్తుచేశారు. రఘురామ కృష్ణరాజుపై ఎంపీగా అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినందున రాజకీయ దురుద్దేశాలతో ఈ పిటిషన్ దాఖలు చేశారని, దాన్ని కొట్టివేయాలని కోరారు. పిటిషనర్ బ్యాంకులను మోసం చేసిన కేసులు ఎదుర్కొంటూ తనపై ఎలాంటి మచ్చ లేదని కోర్టుకు చెప్పారన్నారు. దీనిపై రఘురామ తరఫు న్యాయవాది సమాధానం కోసం విచారణ ఈ నెల 8కి వాయిదా పడింది.
ఇందూ కేసులో జగన్, విజయసాయి డిశ్ఛార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఇందూ టెక్‌జోన్ కేసులో ప్రధాన నిందితుడైన వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి, రెండో నిందితుడైన విజయసాయిరెడ్డి, జగన్‌కు చెందిన కార్మెల్ ఏసియా లిమిటెడ్‌లు గురువారం సీబీఐ కోర్టులో డిశ్ఛార్జి పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో తమను కావాలని ఇరికించారన్నారు. ఇందూ టెక్‌జోన్ కేసుతోపాటు రఘురాం సిమెంట్స్ కేసుల విచారణ ఈ నెల 8కి వాయిదా పడింది.
- ఇదీ చదవండి : అఫ్గాన్‌లో కీలక ప్రాంతాన్ని ఖాళీ చేసిన అమెరికా