ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూముల రీ-సర్వేకు రంగం సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి రీ-సర్వే చేపడుతున్నట్లు ఆ రాష్ట్ర సర్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి అనుగుణంగా జిల్లా కలెక్టర్లు రీ-సర్వే జరిగే గ్రామాల్లో నోటిఫికేషన్ ఇస్తారు. తొలి విడత కింద ఎంపిక చేసిన జిల్లాలు, గ్రామాల్లో నోటిఫికేషన్లను వెంటనే జారీచేయనున్నారు. భూమి రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తైన గ్రామాల్లో ఈ రీ-సర్వే జరగనుంది. తొలి విడతలో 5,000, మలివిడతలో 6,500, మూడో విడతలో 5,500 గ్రామాల్లో నిర్వహిస్తారు.
ప్రయోగాత్మక రీ-సర్వేతో పెరిగిన సర్వే నెంబర్లు!
కృష్ణా జిల్లా జగయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో నోటిఫికేషన్‌లు జారీచేసి రీ-సర్వే చేపట్టారు. ఈ గ్రామంలో గతంలో 150 సర్వే నెంబర్లు ఉండగా రీ-సర్వే తరవాత వీటి సంఖ్య 640కి చేరింది. మొదటి నుంచి వస్తున్న సర్వే నెంబర్లకు అనుబంధంగా మ్యూటేషన్ చేయించుకున్న రైతులు 1, 2 లేదా ఏ లేదా బీ పేర్లతో పట్టాలు పొందారు. దీనివల్ల సర్వే నెంబర్లు పెరిగాయి. ఈ గ్రామంలో 157 ల్యాండ్ పార్సిళ్ళలో సర్వే చేస్తే 112 సర్వే నెంబర్ల మధ్య అంగీకారం కుదిరింది. మిగిలిన ల్యాండ్ పార్శిళ్లపై సంబంధితుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రీ-సర్వేలో తమ వద్ద ఉన్న భూమి కంటే తక్కువ చూపిస్తున్నారన్న ఉద్దేశంతో వాటి యజమానులు అంగీకారం తెలిపేందుకు నిరాకరిస్తున్నారు.
ఫీల్డ్ మ్యాపులు, గ్రామ పటాలు సిద్ధం!
రీ-సర్వేకు అనుగుణంగా గ్రామాల్లో ఫీల్డ్ మ్యాపులు, గ్రామ పటాలు సిద్ధం చేస్తున్నారు. భూముల రీ-సర్వేను కార్స్ ద్వారా, డ్రోన్ల సాయంతో చేపట్టనున్నారు. విజయవాడ, పెడన, జగ్గయ్యపేట, తిరువూరు, పెదవేగి(ప.గో.జిల్లా)ల్లో బేస్‌స్టేషన్లు ఏర్పాటుచేశారు. ఏపీ వ్యాప్తంగా సుమారు 70 బేస్‌స్టేషన్లను వచ్చేనెల 15వ తేదీ నాటికి ఏర్పాటుచేయాలని సర్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 14 నుంచి 19వ తేదీల మధ్య గ్రామ సభలను నిర్వహించి స్థానికులకు భూముల రీ-సర్వేపై అవగాహన కల్పిస్తారు. 2,000మంది పంచాయతీ కార్యదర్శులు, 4,500 మంది వీఆర్వోలు, 9,500 మంది గ్రామ సర్వేయర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
650 మొబైల్ మేజిస్ట్రేట్ బృందాల ఏర్పాటు
రీ-సర్వే నిర్వహణకు ఏపీలో 650 మొబైల్ మేజిస్ట్రేట్ బృందాలు ఏర్పడనున్నాయి. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే లేదా మండల సర్వేయర్ బృందంలో సభ్యులుగా ఉంటారు. రీ-సర్వేలో వచ్చే సమస్యలను ప్రాథమికంగా ఈ బృందాలు పరిష్కరించాల్సి ఉంటుంది. సరిహద్దు రాళ్ల పంపిణీని ఫిబ్రవరి 15నాటికి పూర్తి చేయనుంది.
స్థూలంగా... ఏపీలో రీసర్వే ఇలా!
- 1.26 లక్షల చ.కి.మీ. మేర సర్వే జరగుతుంది. ఇందులో గ్రామ కంఠాల భూములతోసహా వ్యవసాయ, పట్టణ ప్రాంతాల భూములు ఉన్నాయి.
- 90 లక్షల మంది భూ యజమానుల వద్ద 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి.
- 2023 జనవరి నాటికి 17,640 గ్రామాల్లో దశల వారీగా సర్వే పూర్తిచేస్తారు.
- 47,861 గ్రామీణ నివాస ప్రాంతాల్లో 85 లక్షల ఆస్తులు ఉన్నాయి.
- 3,345.93 చ.కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న పట్టణాల్లో 10లక్షల ఖాళీ స్థలాలు, 40 లక్షల ఇళ్లు ఉన్నాయి. వీటిలో 1.5 కోట్ల జనాభా ఉన్నారు.
ఇదీ చదవండి : రాష్ట్ర రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది: సీఎస్