రాష్ట్రంలోని నిరుద్యోగులకు త్వరలో శుభవార్త చెప్పనున్నట్టు మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రేపో, మాపో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ భృతి ప్రకటిస్తారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ విద్యుత్ కార్మిక సంక్షేమ సంఘంలో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం విలీన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే లక్షా 31 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని... మరో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు ప్రకటించారు.
ఆరేళ్లలో అనేక మౌలిక సమస్యలను పరిష్కరించి అభివృద్ధి, సంక్షేమంలో ప్రభుత్వం దూసుకెళ్తోందని పేర్కొన్నారు. కొందరు నాయకులు ఇటీవల నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ వయస్సు, తెలంగాణ తెచ్చారన్న గౌరవం కూడా చూడకుంటా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తెరాస స్థాపించకపోతే తెలంగాణ భాజపా, కాంగ్రెస్ నేతలకు ఉనికి, పదవులే ఉండేవి కావన్నారు. తమ సహనానికి కూడా ఓ హద్దు ఉంటదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'ఉద్యోగుల శ్రమతో విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ'