ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని.. అలా కాకుండా ఎన్నికల కమిషన్ నిర్వహిస్తామంటే అది జరిగే పనికాదని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తాను చెప్పిందే వేదం అనే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కొవిడ్ వ్యాప్తిని పరిగణనలోకి తీసుకుని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాలని ఉద్ఘాటించారు.
కృష్ణా జిల్లా గుడ్డవల్లేరులో మంత్రి కొడాలి నాని మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. నవంబర్, డిసెంబర్‌లో మరోసారి వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందనే నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. గతంలో మాదిరిగా ఎన్నికల నిర్వహణకు ఎక్కువమందిని తరలించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. బిహార్ శాసనసభకు ఎన్నికలు కచ్చితంగా జరగాల్సిన పరిస్థితి ఉందని, వాటితో స్థానిక సంస్థల ఎన్నికలు పోల్చకూడదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండీ... ధరలు అదుపులోకి వచ్చే వరకు రైతుబజార్లలో ఉల్లి అమ్మకాలు