తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ నలుమూలలా ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం కన్నుల పండువగా సాగింది. తొమ్మిది రోజులపాటు వేలాదిమంది భక్తుల విశేష పూజలందుకున్న పంచముఖ మహారుద్ర గణపతి శోభాయాత్ర.. వైభవోపేతంగా జరిగింది. అడుగడుగునా భక్తులు బొజ్జగణపయ్య దర్శించుకొని.. భక్తి భావాన్ని చాటుకున్నారు. 23 అడుగుల వెడల్పుతో కాళనాగేశ్వరి, శ్రీకృష్ణకాళ సమేతంగా కొలువుదీరిన 40 అడుగుల భారీ లంబోదరుడిని వీక్షించేందుకు వేలాది మంది జనం దారిపొడవునా పోటెత్తారు. రెండు కిలోమీటర్ల మేర ఇసుకెస్తే రాలనంతగా జనం తరలివచ్చి మహాగణపతికి వీడ్కోలు పలికారు.
ఆరుగంటలపాటు శోభాయాత్ర
ఉదయం 8 గంటల 18 నిమిషాలకు ప్రారంభమైన శోభాయాత్ర ఆరు గంటలపాటు నయనానందకరంగా సాగింది. భారీకాయుడి నిమజ్జనానం త్వరగా ముగిసేలా.. విస్తృత ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం శోభాయాత్రను నిరంతరం పర్యవేక్షించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ట్యాంక్‌బండ్ చేరుకున్న గౌరీ తనయుడికి చివరిసారిగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంటపాటు పూజల అనంతరం.... శోభాయాత్ర ట్రాలీకి వెల్డింగ్ పనులు పూర్తిచేశారు. ఆ తర్వాత క్రేన్ నంబర్ 4 వద్ద.. మహారుద్రగణపతిని గంగమ్మఒడికి సాగనంపారు.
పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనం
ఏటా ప్రత్యేకమైన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణేశుడు ఈసారి శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా (sri Panchamukha Rudra Maha ganapati) భక్తులకు దర్శనమిచ్చారు. కొవిడ్ వల్ల గతేడాది ఉత్సవాలు నిరాడంబరంగా నిర్వహించినప్పటికీ... ఈసారి భారీగా ఏర్పాట్లు చేసింది ఉత్సవ కమిటీ. ఈ ఏడాది గణపతి విగ్రహం ఎత్తును 40 అడుగులకే పరిమితం చేశారు. గత తొమ్మిది రోజుల్లో గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు.
వచ్చే ఏడాది నుంచి మట్టి వినాయకుడే
వచ్చే ఏడాది నుంచి మట్టి వినాయకున్ని ప్రతిష్టించాలని ఖైరతాబాద్ గణేశ్ (Khairatabad Ganesh) ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి నిర్వాహకులు హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది 70 అడుగుల మట్టి వినాయకున్ని ప్రతిష్టించి అక్కడే నిమజ్జనం చేయనున్నట్లు కమిటీ ప్రతినిధులు ప్రకటించారు.
ఇదీ చదవండి: Balapur laddu Auction: మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంతో తెలుసా?