హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు మూడు ప్రతిపాదనలను రూపొందించినట్లు పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ ఛైర్మన్, ఎంపీ కే కేశవరావు తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. పీవీ జన్మించిన అక్కనపల్లి గ్రామంలో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఆగస్టులో పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. రవీంద్ర భారతిలో కేకే అధ్యక్షతన పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సమావేశమై... తదుపరి కార్యాచరణ, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
అక్టోబర్‌లో హైదరాబాద్‌లో ఓ సదస్సు ఏర్పాటు చేసి... ముఖ్యఅతిథిలుగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ను పిలవనున్నట్లు తెలిపారు. ఏపీలో సభ ఏర్పాటు చేసి... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. ఆరు దేశాల్లో అక్కడి ప్రభుత్వాల అనుమతితో పీవీ విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటు... లెక్చర్ నిర్వహించి ముఖ్యఅతిథిలుగా బిల్ క్లింటన్, ఒబామాను ఆహ్వానించనున్నట్లు కేకే తెలిపారు.
దేశంలోని ఏడు రాష్ట్రాల్లో పీవీ విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పీవీ రాసిన పుస్తకాలను ముద్రించనున్నట్లు చెప్పారు. పీవీ వర్ధంతి రోజు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను ఆహ్వానిస్తామని కేకే వెల్లడించారు.
పీవీ జయంతి ఉత్సవాలకు సంబంధించిన సమాచారం, వివరాలు పొందుపరచడానికి, ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఒక ప్రత్యేక వెబ్సైట్ https://pvnr.telangana.gov.in ను కేకే ఆవిష్కరించారు. పీవీ శతజయంతి ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలు, కార్య స్థలాలు, ఆన్లైన్ దరఖాస్తు ఫారాలు, ఫొటోలు, వీడియోలు, కమిటీ సమావేశాలు, సోషల్ మీడియా అకౌంట్లు, వార్తలు, విశ్లేషణలు, ప్రభుత్వ ఉత్తర్వులు, నిర్ణయాలు వంటి సమాచారం ఈ వెబ్సైట్లో పొందుపరుస్తారు.