ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. డిమాండ్లను అధ్యయనం చేసేందుకు నియమించిన ఆర్టీసీ ఈడీలతో వేసిన కమిటీ నివేదికను సీఎం పరిశీలించి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అధికారులతో సమీక్షించారు. కమిటీ నివేదికనే... ఇవాళ ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించనుంది. కార్మిక సంఘాల నాయకులతో జరిపిన చర్చల వివరాలను అధికారులు కేసీఆర్‌కు వివరించారు. సమ్మెపై చాలా ఓపికపట్టామని కేసీఆర్ అభిప్రాయపడ్డట్లు తెలిసింది.
ఆర్టీసీ యాజమాన్యానికి, కార్మిక సంఘాల నాయకులకు మధ్య శనివారం జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. డిమాండ్లన్నీ చర్చించాలని యూనియన్ నాయకులు కోరగా... కోర్టు సూచించిన 21 అంశాలనే చర్చిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. నిరాకరించిన కార్మిక సంఘాల నేతలు... అధికారులు మళ్లీ చర్చలకు పిలుస్తారని ఎదురు చూసి వెళ్లిపోయారు. ఫలితంగా చర్చలు సఫలం కాలేదు.
ఇదీ చూడండి: ఉవ్వెత్తున ఎగిసిన మంటలు... విద్యుదాఘాతమే కారణం!