నర్సాపూర్ అడవులకు ప్రజలే కాపాలాదారులు కావాలని.. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కథానాయకులు కావాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఏ అధికారి పరిధిలో స్మగ్లింగ్ జరిగితే ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు. కలప స్మగ్లర్లను నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తామని, ఎవరూ కాపాడలేరు హెచ్చరించారు. అడవులను కాపాడేందుకు జిల్లా కలెక్టర్ నరసింహ అవతారం ఎత్తాలన్నారు. అడవులను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని పునరుద్ఘాటించారు.
నేను మొండివాణ్ని.. అనుకుంటే పట్టుబడతా... సాధిస్తా. హైదరాబాద్‌లో ఉన్నవాళ్లు మళ్లీ గ్రామాల వైపు చూస్తున్నారు. సాగునీరు, రైతుబంధు సాయంతో రైతుల్లో ధైర్యం వచ్చింది. రైతు వద్ద డబ్బు ఉంటే గ్రామాలకు గ్రామాలు బాగుపడతాయి. రైతు బాగుపడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రూ.25 వేలలోపు ఉన్నవారికి రుణమాఫీ డబ్బు ఇచ్చాం. రైతుబంధు సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఎవరి వద్దా లేని డబ్బు తెలంగాణ రైతుల దగ్గర ఉన్నాయి. గ్రామాలకు పూర్వవైభవం రావాలి. సంకల్పం ఉంటే అన్ని సమకూరుతాయి. గతంలో గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు ఎందుకు లేవు? దేశంలో ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. నాటిన మొక్కలను రక్షించేందుకు ట్యాంకర్లు ఇచ్చాం. ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి గ్రామ పంచాయతీకి ట్యాంకర్, ట్రాలీ ఏర్పాటు చేసుకున్నాం. - కేసీఆర్, ముఖ్యమంత్రి
నర్సాపూర్‌లో కోల్పోయిన అడవికి మళ్లీ జీవం పోయాలని కేసీఆర్ సూచించారు. సామాజిక అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ప్రభుత్వం వేయాల్సిన ప్రతి అడుగు వేస్తోందన్నారు. ప్రజల నుంచి సహకారం కోరుతున్నామన్నారు. గత పాలకులు తెలంగాణ అడవిని నాశనం చేశారని విమర్శించారు. అడవులను స్మగ్లర్లకు అప్పగించిన పార్టీలే మళ్లీ విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. కలప దొంగలను క్షమించే ప్రసక్తే లేదన్న సీఎం.. స్మగ్లింగ్ ఆటకట్టించేందుకు ఇంటెలిజెన్స్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇవీ చూడండి: హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం