హైదరాబాద్ గచ్చిబౌలి ఐటీ కారిడార్లో భూగర్భజలాలు పాతాళానికి పడిపోవడం వల్ల ఇక్కడి ప్రజలంతా నీటి ట్యాంకర్ల పైనే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ రోలింగ్ హిల్స్ కాలనీలో నివాసం ఉన్న కల్పన రమేష్ కుటుంబం మాత్రం చుక్కనీరు కూడా బయటి నుంచి తెచ్చుకోకపోవడం విశేషం. తమ ఇంటిపై కురిసిన ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి నిత్యావసరాలు తీర్చుకుంటున్నారు. ఎనిమిదేళ్లుగా వాన నీటినే వినియోగిస్తూ నీటి ఆవశ్యకతను చాటిచెబుతున్నారు.
ప్రతి చినుకు... ఉపయోగించేలా
ఇంటి నిర్మాణ సమయంలోనే నీటి ఎద్దడి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కల్పన రమేశ్ దంపతులు నిర్ణయించారు. బోరుబావి తవ్వకుండా... తమ ఇంటిపై కురిసే ప్రతివర్షపు చినుకును ఒడిసిపట్టి వినియోగించుకునేలా నిర్మాణం చేపట్టారు. 6 ఇంకుడు గుంతలు, 30 వేల లీటర్ల సామర్థ్యంతో సంపు ఏర్పాటు చేసుకున్నారు. ఇంటిపై కురిసే ప్రతి వర్షపు చినుకును వాటిలోకి మళ్లేలా పైపులైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.
వాడిన నీటి రీసైక్లింగ్
అధిక వర్షం కురిసినప్పుడు నీరు వృథా కాకుండా సంపులో ఎక్కువైన నీరంతా ఇంకుడు గుంతలోకి వెళ్తోంది. వంట గది, స్నానాల గదిలో ఉపయోగించిన నీళ్లు కూడా రీసైక్లింగ్ ద్వారా ఇంటిముందున్న మొక్కలకు 365 రోజులు అందేలా నీటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంటి ఆవరణలో రకరకాల పండ్లు, పూలమొక్కలతోపాటు డాబాపై ఆకుకూరలు, ఔషధ మొక్కలను పెంచుకుంటూ ఇంటి పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకున్నారు.
40 ఇంకుడు గుంతలు, 14 ఇంజెక్షన్ బోర్వెల్స్
కల్పన రమేశ్ దంపతులు తమ ఇంట్లోనే కాక కాలనీలోనూ వరద నీటిని భూమిలోకి ఇంకిస్తున్నారు. నీరు నిలిచే ప్రాంతాల్లో ఇప్పటికే 40 ఇంకుడు గుంతలు, 14 ఇంజెక్షన్ బోర్ వెల్స్ ను ఏర్పాటు చేశారు. గత నాలుగేళ్లుగా రోలింగ్ హిల్స్ కాలనీలో నీటి ట్యాంకర్ల వాడకం పూర్తిగా తగ్గింది. మొత్తం 90 కుటుంబాలు నీటి ట్యాంకర్లను దూరంపెట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు.
ఏడాదికి లక్ష రూపాయలు ఆదా
వర్షపు నీటిని ఒడిసిపట్టడం ద్వారా ఏడాదికి ఒక్కో కుటుంబం లక్ష రూపాయలు ఆదా చేయవచ్చని కల్పన రమేష్ చెబుతున్నారు. నీటి నిర్వహణపై మహిళలు దృష్టిసారిస్తే భావితరాలకు చక్కటి ఆరోగ్యాన్నే కాకుండా... ప్రభుత్వాలపై భారం కూడా తగ్గించవచ్చని సూచిస్తున్నారు. నీటిని పొదుపు చేయడం ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని కోరుతున్నారు. నీటి వృథాపై ప్రజలను చైతన్యపరిస్తూ ఐటీ కారిడార్లో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కల్పన రమేశ్ దంపతులు.
ఇదీ చూడండి : నీటి కోసం బస్తీవాసుల భగీరథ యత్నం