రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య(Disha rape case) నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్(Justice sirpurkar commission) విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే మృతుల కుటుంబ సభ్యులు, పలువురు అధికారులు, సిట్ ఛైర్మన్ మహేశ్ భగవత్, ఘటన జరిగినప్పుడు సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్లను ప్రశ్నించారు. వారి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు.
తాజాగా ఈ కేసుకు సంబంధించి.. సీఐ నర్సింహారెడ్డి, గచ్చిబౌలి అదనపు ఇన్‌స్పెక్టర్ లాల్‌మదర్‌ను ప్రశ్నించారు. దిశ హత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న ఆరీఫ్, చెన్నకేశవులు తుపాకులు లాక్కొని.. పోలీసులపై కాల్పులు జరపడం వల్లే ఎదురుకాల్పులు జరిపినట్లు సీఐ నర్సింహారెడ్డి సిర్పూర్కర్ కమిషన్‌కు తెలిపారు. తుపాకీ ఎలా లోడ్‌చేస్తారని కమిషన్ ప్రశ్నించగా సీఐ నర్సింహారెడ్డి తన వద్ద ఉన్న పిస్టల్‌ను లోడ్‌చేసి కమిషన్ సభ్యులకు చూపించారు. పోలీసుల కళ్లల్లో నిందితులు మట్టికొట్టడంతో పాటు రాళ్లు, కట్టెలు విసిరారని కమిషన్‌కు చెప్పారు.
ఆ తర్వాత గచ్చిబౌలి అదనపు ఇన్‌స్పెక్టర్ లాల్‌మదర్‌ను కమిషన్ సభ్యులు(Justice sirpurkar commission) ప్రశ్నించారు. నిందితులను ఉంచిన అతిథిగృహం నుంచి చటాన్‌పల్లికి ఎప్పుడు వెళ్లారు, ఎంతమంది పోలీసులు వెళ్లారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. లాల్‌మదర్ నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు ఇవాళ మరోసారి కమిషన్ అతణ్ని ప్రశ్నించనుంది.