jangareddy gudem victims on spurious liquor deaths: ఏపీ జంగారెడ్డిగూడెం నాటుసారా మృతుల కుటుంబసభ్యుల బహిరంగ నివేదన కార్యక్రమం విజయవాడలో జరిగింది. సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. నాటుసారా మృతుల కుటుంబసభ్యులు వారి ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తులు ఆరోగ్యంగానే ఉన్నారని.. సారా తాగటం వల్లే మరణించారని తెలిపారు.
జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 25మంది చనిపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన చెందారు. ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించటం బాధాకరమన్నారు.
దుర్మార్గంగా వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పే స్థాయికి సీఎం దిగజారారు. కల్తీసారా తాగిన తర్వాత కడుపులో మంటతో ఇబ్బంది పడ్డారు. కల్తీసారా తాగిన తర్వాత బాధితులకు కళ్లు కనపడలేదు. బాధితులు కల్తీసారా తాగి వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. చనిపోయిన వ్యక్తులు గతంలో ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులే చెప్పారు.నాటుసారాకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు 148 కేసులు పెట్టారు.ఎస్‌ఈబీ అధికారులు 156 మందిపై కేసులు నమోదు చేశారు. బాధిత కుటుంబాలతో ప్రభుత్వం మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలి. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి. -రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
సారా వల్లే నా కుమారుడు చనిపోయాడు. ఘటనకు సంబంధించి సంతకం చేయాలని పోలీసులు కోరారు. సారా తాగిన తర్వాత నా కుమారుడు అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు, విరేచనాలతో మా కుమారుడిని ఆస్పత్రికి తరలించాం. - ఫాతిమా, బాధిత కుటుంబ సభ్యురాలు
ఇదీ చదవండి : ఆర్టీసీలో వీఆర్‌ఎస్ పథకం.. అమలుపై వివరాల సేకరణ