జీహెచ్ఎంసీ పరిధిలోని ఇంటింటికీ నెలకు ఇరవై వేల లీటర్ల వరకు ఉచిత తాగునీటి పథకం గడువు గత ఏప్రిల్ మాసంలోనే ముగిసినప్పటికీ.. మరొకసారి ఈ పథకాన్ని పొందేందుకు ప్రభుత్వం ఆగష్టు 15 వ తేది వరకు పొడిగించిందని జలమండలి ఎండీ దానకిషోర్ తెలిపారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు నెలకు ఇరవై వేల ఉచిత తాగునీటి పథకం అమలు, పురోగతి పై జలమండలి ఎండీ దానకిషోర్ సమీక్ష నిర్వహించారు.
ఉచిత తాగునీటి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం కల్పించాలని, ఇందుకోసం ఒక్కో డివిజన్‌కు ఒక్కో వ్యూహం అనుసరించి ప్రజలు ఈ పథకాన్ని పొందేందుకు తగిన కసరత్తు చేయాలని సూచించారు. వినియోగదారులు తమ కనెక్షన్లకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలంటే తమ దగ్గర్లో ఉన్న మీ-సేవా కేంద్రాల ద్వారా లేదా.. జలమండలి వెబ్‌సైట్ www.hyderabadwater.gov.in లో అనుసంధానం చేసుకోవచ్చని తెలిపారు. వినియోగదారులు మరింత సమాచారం కోసం జలమండలి కస్టమర్ కేర్ 155313 ని సంప్రదించాలని కోరారు. అనంతరం బోర్డు రెవెన్యూ , వర్షాకాల ప్రణాళిక వంటి అంశాలపై దానకిషోర్ ఆరా తీశారు.
ఎన్నికలప్పుడు సీఎం కేసీఆర్ హామీ..
గత బల్దియా పాలకవర్గ ఎన్నికల హామీల్లో భాగంగా హైదరాబాద్ మహానగరంలో ఉచిత తాగునీటిని అందరికీ అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు కొన్ని నిబంధనలను రూపొందించారు. ప్రతి నల్లాదారుడు తమ పీటీఐఎన్ నంబరుతోపాటు ఆధార్ నంబరును జలమండలి వెబ్సైట్లోకి వెళ్లి అనుసంధానం చేసుకోవాలన్నది మొదటి నిబంధన. రెండోది నల్లాకు తప్పనిసరిగా మీటరు ఏర్పాటు చేయడం. ఈ రెండూ ఉంటేనే ఉచిత తాగునీటి పథకానికి అర్హులని పేర్కొంది.
గత ఏడాది డిసెంబరు నుంచి ఉచితంగా నీరు ఇస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు వరకు అనుసంధానానికి గడువు ఇచ్చింది. మొత్తం 10.50 లక్షల తాగునీటి కనెక్షన్లు ఉంటే 9.50 లక్షల కనెక్షన్లు గృహాలకు సంబంధించినవి. వీరంతా పథకంలో భాగం కావాలన్న ఉద్దేశంతో జలమండలి ఎండీ దానకిశోర్ సిబ్బందిని అపార్ట్మెంట్లకు పంపి.. అనుసంధానం చేయాలని గతంలో సూచించారు. పెద్ద ఎత్తున కృషి చేసినా.. చాలా మంది ముందుకు రాలేదు. 4.50 లక్షల మంది మాత్రమే స్పందించారు. దీంతో ఉచిత తాగునీటి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం కల్పించాలని, ఇందుకోసం ఒక్కో డివిజన్‌కు ఒక్కో వ్యూహం అనుసరించి ప్రజలు ఈ పథకాన్ని పొందేందుకు తగిన కసరత్తు చేయాలని సూచించారు.
ఇవీ చూడండి: LOGISTICS POLICY: తెలంగాణ లాజిస్టిక్ పాలసీకి కేబినెట్ ఆమోదం